తెలుగువారు గర్వించే నటి సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. సావిత్రిగా కీర్తిసురేష్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇందులో సమంత కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసిందే. ఆమె పేరుతో పాటు.. లుక్ ని కూడా ఈరోజు అధికారికంగా రిలీజ్ చేశారు. కళ్ళజోడు, పొడుగు జడ వేసుకొని అలనాటి జర్నలిస్ట్ గా ఆకట్టుకుంది. అంతే కాదు పాత్ర పేరుని వినూత్నంగా పరిచయం చేశారు. “నా పేరు కన్యాశుల్కంలో సావిత్రి గారి పేరే మధురవాణి” అని వెల్లడించారు. దీంతో కన్యాశుల్కం ఏంటి?, మధురవాణి ఎవరు? అని నేటి సినీ ప్రేక్షకులు ఆరా తీయడం మొదలెట్టారు.
ప్రముఖ తెలుగు రచయిత గురుజాడ అప్పారావు 1892 లో రచించిన సాంఘిక నాటకం ఇది. 120 ఏళ్ళ క్రితం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం ఇది. ఈ నాటకాన్ని నేటి సినీ నటులు సైతం విదేశాల్లోనూ ప్రదర్శిస్తుంటారు. అయితే ఇదే నాటకాన్ని డైరక్టర్ పి పుల్లయ్య వెండితెరపై ఆవిష్కరించారు. 1955 లో కన్యాశుల్కం సినిమా రిలీజ్ అయింది. ఇందులో ప్రధాన పాత్రలు అయినా గిరీశం పాత్రను ఎన్టీఆర్ పోషించగా, మధురవాణిగా సావిత్రి జీవించారు. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం(సినిమా) ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఆ పాత్రను గురజాడ అద్భుతంగా రాయగా.. సావిత్రి ఆ పాత్రలో మహాద్భుతంగా నటించి మధురవాణి పేరు అందరి నోటా నానేలా చేశారు. అటువంటి పేరుతో సమంత మహానటిలో మనకి కనిపించనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్, స్వప్న సినిమా బ్యానర్లపై అశ్వినీదత్, స్వప్నదత్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల రిలీజ్ కానుంది.