తెలుగు-తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న ఏకైక కథానాయిక సమంత. పెళ్ళైన తర్వాత సినిమాల స్పీడ్ మరింత పెంచిన సమంత ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో (రంగస్థలం, మహానటి, అభిమన్యుడు) సూపర్ హిట్స్ అందుకొన్న సమంత నాలుగో సినిమా “యు టర్న్”తో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా పెళ్ళైన తర్వాత తన సినీ ప్రయాణం ఎలా ఉంది, కెరీర్ పరంగా వచ్చిన మార్పులేమీటీ? వంటి విషయాలను మీడియాతో ముచ్చటించింది సమంత. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!!
అక్కడ విడుదలవ్వడానికంటే ముందే రీమేక్ చేయాలనుకొన్నాను..
నేను దర్శకుడు పవన్ కుమార్ కి “లూసియా” టైమ్ నుంచి పెద్ద ఫ్యాన్ ని. అతని సినిమాలంటే చాలా ఇష్టం. “యు టర్న్” కన్నడ ట్రైలర్ విడుదలవ్వాగానే నేనే ఫోన్ చేసి సినిమా గురించి అడిగి స్క్రిప్ట్ పంపమన్నాను. స్క్రిప్ట్ చదివాక విపరీతంగా నచ్చేసింది. వెంటనే రీమేక్ చేద్దామని అనుకున్నాను. కానీ.. నేను ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాల డేట్స్ ఎడ్జస్ట్ మెంట్ కి కాస్త ఇబ్బందిరావడంతో తెలుగు-తమిళ రీమేక్ మొదలవ్వడానికి ఇన్నాళ్ళు పట్టింది.
మంచి పేరు ఎవరికి కావాలి..
నేను ఒక సినిమా ఒప్పుకొన్నాను అంటే.. ఆ సినిమాతో నాకు మంచి పేరు వస్తే సరిపోతుంది అని మాత్రం అనుకోను. అయినా మంచి పేరొస్తే సరిపోతుందా చెప్పండి. సినిమాకి డబ్బులు పెట్టిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నప్పుడే సినిమా హిట్ అని భావిస్తాను నేను. నావరకూ బాక్సాఫీస్ లెక్కలే సినిమా విజయానికి ప్రతీకలు.
ఈ సంవత్సరం చాలా రిస్క్ చేశాను..
“రంగస్థలం” సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించడం చాలా రిస్కీ మేటర్. ఎందుకంటే అంతకుముందు వరకు నేను కనీసం విలేజ్ కి వెళ్లింది కూడా లేదు. ఆ తర్వాత “అభిమన్యుడు” సినిమా కోసం ఒక కొత్త డైరెక్టర్ తో వర్క్ చేశాను. “మహానటి” కూడా ఒక రిస్కే. ఇక “యు టర్న్” రీమేక్ అయితే నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిస్క్. స్టార్ హీరోలు లేకుండా కేవలం కథను నమ్మి నటించిన చిత్రమిది. సో, ఈ ఇయర్ చాలా రిస్క్ చేశాను.
మార్పులు సినిమా రీచ్ ను పెంచడానికి చేసినవే..
“యు టర్న్” ఒరిజినల్ చూసినవాళ్ళందరూ మా ట్రైలర్ చూశాక కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా యాడ్ చేసినట్లున్నారు కదా అని అడుగుతున్నారు. కానీ.. సినిమా రేంజ్ పెంచడం కోసం కాస్త బెటర్ బడ్జెట్ తో చిత్రాన్ని తెరకెక్కించాం తప్పితే ఎక్కడా ఒరిజినల్ ఫీల్ మాత్రం పోనివ్వలేదు. ఒరిజినల్ వెర్షన్ చూసిన కొందరు మా సినిమా చూసి “ఒరిజినల్ కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది” అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. క్లైమాక్స్ మాత్రం మన నేటివిటీకి, ఆలోచనా ధోరణికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం తప్పితే.. సినిమా ఫీల్ ను మాత్రం ఎక్కడా పోగొట్టలేదు.
ఒరిజినల్ సమంతను చూశామన్నారు..
బేసిగ్గా నేను చాలా మంచి డ్యాన్సర్ ని. స్కూల్ & కాలేజ్ టైమ్ లో ప్రతి ఈవెంట్ లో తెగ డ్యాన్స్ చేసేదాన్ని. కానీ సినిమాలో నా డ్యాన్స్ స్కిల్స్ చూపించడానికి మాత్రం అవకాశం రాలేదు. అయితే.. మొదటిసారిగా “యు టర్న్” సినిమా కోసం చేసిన “ది కర్మ” థీమ్ సాంగ్ లో నన్ను చూసిన నా ఫ్రెండ్స్ అందరూ “ఇప్పటికీ ఒరిజినల్ సామ్ ను చూశాం” అంటున్నారు.
ఇంకా చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది..
ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రలన్నీ ఒకెత్తు అయితే.. “యు టర్న్”లో నేను ప్లే చేసిన జర్నలిస్ట్ రోల్ ఒకెత్తు. ఇకపై కమర్షియల్ హీరోయిన్ రోల్స్ తోపాటు ఇంకాస్త టిపికల్ & ఎక్స్ పెరిమెంటల్ రోల్స్ చేయాలని ఉంది. నా అదృష్టం బాగుండి ఆ తరహా పాత్రలే ఎక్కువస్తున్నాయి.
లగ్జరీస్ ఎప్పుడూ కోరుకోలేదు..
సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా నేను ఎప్పటికీ సిద్ధమే. “యు టర్న్” షూట్ నా కెరీర్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్. ఇప్పటివరకూ చాలా లావిష్ ప్లేసెస్ లో షూట్ చేశాం కానీ.. “యు టర్న్” కోసం రోడ్ల మీద, ఆటోల్లో కూడా షూట్ చేశాం. చాలా మంచి షూటింగ్ ఎక్స్ పీరియన్స్ అది. నేను సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా రెడీ. నేను లగ్జరీస్ ఎప్పుడూ కోరుకోలేదు.
ఇకపై నా సినిమాలన్నిటికీ నేనే డబ్బింగ్ చెప్పుకొంటాను..
నటిగా నన్ను నేను నిరూపించుకొన్నాను. కానీ.. ప్రేక్షకులకు కొత్తగా ఏం ఇస్తున్నాను అని అనుక్షణం ఆలోచిస్తుంటాను. అందుకే “రంగస్థలం, మహానటి” చిత్రాల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకొన్నాను. ఇకపై నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందువల్ల పాత్రలకు సహజత్వం రావడంతోపాటు ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారు.
ఆ తప్పుని తర్వాత సరిచేశాం..
ట్రైలర్ లో మాకు తెలియకుండా డబ్బింగ్ విషయంలో కొన్ని తప్పులు దొర్లాయి. నిజానికి అది అనవసరంగా జరిగిన తప్పు. అందుకే తర్వాత నాకు తెలిసిన కొందరికి నా డబ్బింగ్ వెర్షన్ ను చూపించి అవసరం అనుకున్న తప్పుల్ని సరిదిద్దాం. అందుకోసం ఒక రెండు మూడు రోజులు కష్టపడాల్సి వచ్చినా తప్పలేదు.
అదే నా మ్యారేజ్ డే గిఫ్ట్..
అక్టోబర్ 6వ తారీఖున నా మొదటి మ్యారేజ్ యానివర్సరీ. ఈ యానివర్సరీ స్పెషల్ ఏంటంటే.. నేను నాగచైతన్య కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ ను ఆ రోజే మొదలెడుతున్నాం. అదే నా మ్యారేజ్ గిఫ్ట్ అనుకుంటున్నాను. అయినా.. ఒక నటిగా కొత్త వర్క్ చేయడం కంటే బెటర్ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి.
భార్య పోస్ట్ ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది..
పెళ్ళైన తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తున్నారేంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు కానీ.. నాకు పెళ్ళైన తర్వాత “భార్య” స్థానం సంపాదించుకున్నాక ఎక్కువ సేఫ్టీగా ఫీలవుతున్నాను. అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తోనే ఎక్కువ సినిమాలు చేయగలుగుతున్నాను. ఇప్పటివరకూ ఇంట్లో నేను ఒక్కసారి కూడా వంట చేయలేదు. అలాగే వర్క్ గురించి ఇంట్లో అస్సలు డిస్కస్ చేయను. సో, దాన్ని బట్టి మీరే అర్ధం చేసుకోండి నన్ను మామ నాగార్జున గారు, మా ఆయన ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో.
మా ఆయన సినిమా చాలా బాగుంది..
రీసెంట్ గా “శైలజా రెడ్డి అల్లుడు” సినిమా చూశాను. పండగ రోజు ప్రేక్షకులు చూడాలనుకొనే సినిమా ఇది. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు మంచి కామెడీ ఉన్న సినిమా ఇది. తప్పకుండా చైతూ ఈ చిత్రంతో మంచి హిట్ కొడతాడు. నా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం చెన్నైలో అవ్వడం వల్ల చైతన్య నా సినిమా ఇంకా చూడలేదు.
ఆ సక్సెస్ క్రెడిట్ నేను తీసుకొను..
నేను నటించిన కొన్ని సినిమాలు ఓవర్సీస్ లో సూపర్ సక్సెస్ అయ్యాయి కదా అని ఆ సక్సెస్ క్రెడిట్ ను నా ఖాతాలో వేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే.. ఆ సినిమాలు ఓవర్సీస్ లో సక్సెస్ సాధించడానికి కారణం హీరో స్టార్ డమ్ & డైరెక్టర్ కాంబినేషన్. ఈ రెండు కుదిరాయి గానుకే సినిమాలు మిలియన్ డాలర్స్ వసూలు చేశాయి.
అందుకే అందరూ నన్ను ఒపీనియన్ అడుగుతారు..
నా భర్త చైతూ మొదలుకొని అందరూ నాకు తమ సినిమాలు చూపించడమో లేక కథలు చెప్పడమే చేస్తుంటారు. అందుకు కారణం నేను నిజాయితీగా నా ఒపీనియన్ ను చెప్పడమే. బాగుందో లేదో ముఖం మీద చెప్పేస్తాను.
– Dheeraj Babu