“ఎస్.ఆర్.కళ్యాణమండపం”తో మంచి హిట్ సొంతం చేసుకుని.. అనంతరం “సెబాస్టియన్”తో తడబడిన కిరణ్ అబ్బవరం.. “సమ్మతమే” అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరించాయి. మరి సినిమా ఏస్థాయిలో ఉంది? కిరణ్ అబ్బవరం మళ్ళీ సక్సెస్ అందుకోగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!
కథ: పద్ధతి గల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడమే ధ్యేయంగా బ్రతుకుతుంటాడు కృష్ణ (కిరణ్ అబ్బవరం). ఆ ప్రొసెస్ లో పరిచయమైన అమ్మాయి సాన్వి (చాందిని చౌదరి). సాన్వి తనకి బాగా నచ్చినప్పటికీ.. ఆమె మోడ్రన్ మైండ్ సెట్ తో రాజీపడలేకపోతాడు కృష్ణ. కృష్ణ పద్ధతి నచ్చినప్పటికీ.. అతడి మైండ్ సెట్ నచ్చక అతడి నుంచి దూరమవ్వాలనుకుంటుంది సాన్వి. ఈ ప్రేమ పెనుగులాటలో చివరికి ఎవరు గెలిచారు? ఎలా దగ్గరయ్యారు? అనేది “సమ్మతమే” కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా కిరణ్ కి చాలా మైనస్ లు ఉన్నప్పటికీ.. క్యారెక్టర్ లో ఇమిడిపోవడం అనేది అతనికి పెద్ద ప్లస్ పాయింట్. మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు కిరణ్, అయితే.. డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే.. ఎమోషనల్ సీన్స్ లో బ్లాంక్ గా ఉండిపోతున్నాడు. మరీ ముఖ్యంగా.. చాందిని చౌదరి నటన ముందు కిరణ్ చాలా సన్నివేశాల్లో తేలిపోయాడనే చెప్పాలి. ప్రస్తుత యువ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకోగలిగే అవకాశం ఉన్న అతి తక్కువ హీరోల్లో కిరణ్ ఒకడు, డైలాగ్ డెలివరీ & మోడ్యూలేషన్ విషయంలో జాగ్రత్త వహించకపోతే మాత్రం అది కష్టమే.
చాందిని చౌదరి నటిగా కిరణ్ కంటే సీనియర్ అవ్వడం, ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా హీరోని డామినేట్ చేసేది కావడం వల్ల సాన్వి పాత్రలో చాందిని సరిగ్గా సరిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగమ్మాయి, సొంత డబ్బింగ్ అవ్వడం వలన.. ఆమె పాత్రతో ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ సీన్స్ లో ఆమె చూపిన పరిపక్వత, హావభావాలు నటిగా ఆమెకు మంచి అవకాశాలు తెచ్చిపెట్టడం ఖాయం. సద్దాంకు మంచి రోల్ దొరికింది ఈ చిత్రంలో. కామెడీతో అలరించాడు.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సినిమాకి హీరో అని చెప్పాలి. తన మధురమైన పాటలతో, నేపధ్య సంగీతంతో సినిమాకు మంచి వేల్యూ యాడ్ లా నిలిచాడు. సినిమాటోగ్రఫీ సోసోగా ఉండగా.. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో చాలా లోపాలు కనిపిస్తాయి. దర్శకుడు గోపీనాధ్ రెడ్డి.. ఒక సాధారణ కథను, ఎమోషనల్ కనెక్టివిటీతో రన్ చేస్తూ.. ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలనుకున్నాడు.
కొంత మేరకు సక్సెస్ అయ్యాడు కూడా.. అయితే, సెకండాఫ్ లో ఇచ్చిన జస్టిఫికేషన్స్, లాజిక్స్ అప్పటివరకూ సినిమాలో కాస్తోకూస్తో లీనమైన ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేస్తుంది. ప్రేమ ఎప్పుడూ కాంప్లికేటడే.. అయితే దాన్ని రిసాల్వ్ చేసే విధానం కన్విన్సింగ్ గా ఉండాలి. అది లేకపోతే.. ఎంత గొప్ప కథనమైనా.. మట్టి కరవాల్సిందే. “సమ్మతమే” చిత్రం విషయంలో జరిగింది అదే. అందువల్ల కథకుడిగా పర్వాలేదనిపించుకున్న గోపీనాధ్.. దర్శకుడిగా మాత్రం పాస్ మార్కులు సాధించలేకపోయాడు.
విశ్లేషణ: కిరణ్ అబ్బవరం మునుపటి చిత్రం “సెబాస్టియన్”, ఇప్పుడు “సమ్మతమే”.. ఈ రెండు సినిమాల్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానమే మైనస్ గా మారుతుంది. ఈ మైనస్ ను కాస్త సీరియస్ గా తీసుకొని తన తదుపరి చిత్రాల విషయంలోనైనా జాగ్రత్త తీసుకొంటే సరి.. లేదంటే మాత్రం సినిమా ఎప్పుడొచ్చింది, వెళ్లింది అనే విషయం కూడా తెలియకుండా పోతుంది.