సంజు

తెరిచిన పుస్తకం లాంటి సంజయ్ దత్ జీవితం ఆధారంగా మాస్టర్ ఫిలిమ్ మేకర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన చిత్రం “సంజు”. రణబీర్ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి విశేషమైన అంచనాలున్నాయి. అంచనాలను అందుకోగలిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే.. సంజుని, అతడి జీవితాన్ని రాజ్ కుమార్ హిరానీ ఎలా చూపించాడు? అనేది ఈ చిత్రంలోని కీలకమైన విషయం.

కథ:
ఇక్కడ కథ అంటే సంజయ్ జీవితం. తండ్రి అడుగుజాడల్లో హీరోగా కెరీర్ మొదలుపెట్టడం మొదలుకొని డ్రగ్స్ కి బానిసవ్వడం, ఆ మత్తులోనే తల్లిని కోల్పోవడం, డ్రగ్స్ మత్తు వదిలించుకొని మళ్ళీ హీరోగా కెరీర్ పుంజుకోవడం, టెర్రరిస్ట్ గా ముద్రపడడం, ముంబై నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డడం, టాడా కేస్ లో అయిదేళ్లపాటు జైల్లో మగ్గడం, నిర్ధోషిగా జైల్ నుంచి బయటపడినా.. టెర్రరిస్ట్ అనే నిందను భరించడం వరకూ సంజయ్ దత్ జీవితంలో చోటు చేసుకొన్న చాలా విషయాల్ని “సంజు” చిత్రంలో పొందుపరిచి చిత్రీకరించారు.

నటీనటుల పనితీరు:
“రాక్ స్టార్” చిత్రంతోనే నటుడిగా తన స్టామినాను, స్థాయిని నిరూపించుకొన్న రణబీర్ కపూర్ కు మంచి హిట్ వచ్చి చాలా రోజులైంది. ప్రతి సినిమాతోనూ నటుడిగా ఆకట్టుకొంటున్నాడు కానీ.. సినిమాలు మాత్రం ఫ్లాపవుతున్నాయి. “సంజు”తో ఆ ఒరవడికి బ్రేక్ పడింది. ఈ సినిమాతో రణబీర్ కపూర్ తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకొన్నాడు. సినిమా చూస్తున్నంతసేపు అతడు రణబీర్ కపూర్ అనే విషయం జనలాను గుర్తురాదు.. వాళ్ళు సంజయ్ దత్ ని చూస్తున్నారు అనే భావనలోనే ఉంటారు. ఒక నటుడిగా ఇంతకంటే ఎవరుమాత్రం ఏం సాధించగలరు. ఆఖరికి సినిమా ఎండింగ్ లో నిజమైన సంజయ్ దత్ స్క్రీన్ మీద కనబడుతున్నప్పటికీ.. ప్రేక్షకులు రణబీర్ నే సంజయ్ లా చూస్తుంటారు.
ఇక సినిమా చూస్తున్నంతసేపు.. ఆన్ స్క్రీన్ హీరోగా సంజయ్ దత్ పాత్ర కనిపిస్తుంటుంది కానీ.. ఆఫ్ ది స్క్రీన్ హీరో మాత్రం సునీల్ దత్ ది. చెడు మార్గంలో ప్రయాణిస్తున్న తనయుడ్ని సన్మార్గంలోకి తీసుకురావడం కోసం ఆయన పడే తపన, కొడుకు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడనే బాధతో తాను కూడా కటిక నెల మీద పడుకొనేంత పిచ్చి ప్రేమ, కొడుకు ఎప్పుడు తనను తాను తక్కువగా భావిస్తున్నా ఇన్స్పైర్ చేసి ముందుకు నడిపే మహోన్నతమైన వ్యక్తిగా సునీల్ దత్ కనిపిస్తారు. ఆయన పాత్రను పరేష్ రావల్ అద్భుతంగా పోషించారు.
వీరిద్దరి తర్వాత సినిమాలో కీలకపాత్ర పోషించి.. వీళ్ళిద్దరికంటే ప్రేక్షకుల చేత ఎక్కువగా కన్నీరు పెట్టించిన వ్యక్తి విక్కీ కౌశల్. సంజయ్ దత్ ప్రాణ స్నేహితుడు కమలేష్ పాత్రలో విక్కీ నటన చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. స్నేహమంటే ఇది కదా అని అందరూ అనుకొనేలా, ఇలాంటి స్నేహితుడు మనకి కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. తల్లి పాత్రలో మనీషా కోయిరాలా, భార్య మాన్యత పాత్రలో దియా మీర్జా, రైటర్ గా అనుష్క శర్మలు తమ పాత్రల్లో జీవించారు.

సాంకేతికవర్గం పనితీరు:
రెహమాన్ నేపధ్య సంగీతం, “కర్ హర్ మైదాన్ ఫతే” పాట కానీ ఆ పాట చిత్రీకరణ కానీ మనల్ని కొన్నాళ్లపాటు వెంటాడుతుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. అలాగే.. ఆర్ట్ వర్క్, సౌండింగ్, డి.ఐ వంటి విషయాలన్నీ అద్భుతంగా కుదిరాయి. సినిమా అంతా బాగుంది, రణబీర్ అద్భుతంగా నటించాడు. కానీ.. సినిమాలో పెద్ద మైనస్ ఏంటంటే “సంజు” సినిమా మొత్తం సంజయ్ దత్ దృష్టికోణం నుంచే సాగుతుంది. అసలు సంజయ్ దత్ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. డ్రగ్స్, అమ్మాయిలు తప్ప వేరే చెడు అలవాట్లు సంజయ్ దత్ కి లేదు అన్నట్లుగా చూపించడం పెద్ద మైనస్. ప్రతి మనిషి జీవితంలో ప్లస్ తోపాటు మైనస్ లు కూడా ఉంటాయి. కానీ.. హిరానీ మాత్రం కేవలం సంజయ్ దత్ చెప్పినట్లుగా మాత్రమే తీశారు. సంజయ్ మీద వచ్చిన అభియోగాలన్నీ నిరాపరాధమైనవే అన్నట్లుగా చిత్రీకరించారు. సంజయ్ దత్ కి అప్పట్లో బోలెడన్ని ఎఫైర్లున్నాయి, చాలా మంది తోటి హీరోహీరోయిన్లతో గొడవలు పడ్డాడు.. ఆ కారణంగా ఇండస్ట్రీలో అతడ్ని దూరం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. రాజ్ కుమార్ హిరానీ వాటిని కనీసం టచ్ కూడా చేయకపోవడం గమనార్హం.

విశ్లేషణ:
“సంజు” చిత్రం సంజయ్ దత్ తన తండ్రి సునీల్ దత్ కి రాసిన ఓ ప్రేమలేఖ. తనను అనునిత్యం కాపాడుతూ వచ్చిన తండ్రికి తాను సరైన నివాళి ఇవ్వలేకపోయాననే బాధను రాజ్ కుమార్ హిరానీ “సంజు” చిత్రం ద్వారా తీర్చాడు. ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ & సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా ఒకసారి చూడండి.

రేటింగ్: 4/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus