ఈ మధ్యకాలంలో జనాలు ఒక సినిమా థియేటర్లో ఎప్పడు రిలీజ్ అవుతుంది అనే విషయం కంటే ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. మితిమీరిన టికెట్ రేట్స్, ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లడానికి ట్రావెలింగ్ గట్రా ఛార్జీలు భరించలేక, ఓటీటీలో రిలీజైనప్పుడు చూసుకోవచ్చులే అని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు కూడా థియేటర్లలో విడుదలైన సినిమాను ఎంత త్వరగా తమ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి రిలీజ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు.
అందువల్ల థియేటర్ రిలీజ్ & ఓటీటీ రిలీజ్ కి మధ్య కనీస స్థాయి గ్యాప్ లేకుండాపోతుంది. ఇటీవల “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా ఈ ఓటీటీ రిలీజ్ విండో గురించి ప్రస్తావించగా మంచి గ్యాప్ ఉంటుంది అని దిల్ రాజు & డివివి దానయ్య (D. V. V. Danayya) గర్వంగా పేర్కొన్నారు. కట్ చేస్తూ.. ఓటీటీ సంస్థ “నెట్ ఫ్లిక్స్” మాత్రం సైలెంట్ గా “సరిపోదా శనివారం” ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 26 విడుదల అని ప్రకటించింది.
నిజానికి ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది ఆగస్ట్ 29న, ఓటీటీ రిలీజ్ డేట్ ఏమో సెప్టెంబర్ 26. అంటే కనీసం 30 రోజుల గ్యాప్ కూడా లేకుండాపోయింది. 100 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన తర్వాత ఇక చాల్లే అనుకున్న బృందం నాలుగువారాల గ్యాప్ తో సినిమాను ఓటీటీకి వదిలేశారు.
ఇకపోతే.. “దసరా (Dasara), హాయ్ నాన్న (Hi Nanna), సరిపోదా శనివారం” వంటి వరుస విజయాలతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ అందుకున్న నాని (Nani) ఈ మూడు హిట్స్ ఇచ్చిన ఉత్సాహంతో “హిట్ 3” షూట్ లో ఆల్రెడీ యమ బిజీగా ఉన్నాడు. త్వరలోనే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో మరో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నాడు.