మహేష్ బాబు తన సబ్టల్ సర్కిల్ నుంచి కాస్త బయటకు వచ్చి నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట”. “గీత గోవిందం” అనంతరం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. సినిమా పాటలు, టీజర్ & ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. మహేష్ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: బ్యాంకుకు వడ్డీ కట్టలేక ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులను చూసిన బాధతో బాగా చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తూ.. ఈ.ఎం.ఐ లు ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంటాడు మహేష్ (మహేష్ బాబు).
తన దగ్గర అప్పు తీసుకున్న కళావతి (కీర్తి సురేశ్) బాకీ వసూలు చేయడం కోసం వైజాగ్ వచ్చిన మహేష్ కి, కళావతి తండ్రి, రాజ్యసభ సభ్యుడైన పొలిటీషియన్ (సముద్రఖని) ఏకంగా 10 వేల కోట్ల అప్పు ఎగ్గొట్టాడని తెలుస్తుంది.
తన 10 వేల డాలర్ల అప్పుతో పాటు బ్యాంక్ కు కట్టాల్సిన 10 వేల కోట్ల అప్పును సముద్రఖనితో మహేష్ బాబు ఎలా కట్టించాడనేది “సర్కారు వారి పాట” కథాంశం.
నటీనటుల పనితీరు: మళ్ళీ ఖలేజా మహేష్ ను చూసిన అనుభూతి కలుగుతుంది ఈ చిత్రంలో మహేష్ ను చూస్తుంటే. అయితే.. అసందర్భమైన, అనవసరమైన బూతులు క్యారెక్టరైజేషన్ ను డైల్యూట్ చేశాయి. మహేష్ తన పాత్ర వరకూ అందంగా, హుందాగా నటించి తన అభిమానులను అలరించడానికి విశ్వప్రయత్నం చేశాడు.
కీర్తిసురేష్ క్యారెక్టర్ ఎంటర్ టైనింగానే ఉన్నప్పటికీ.. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్ లా సెన్స్ లేకుండా ఉంది. అందువల్ల ఆమె నటిగా ఎక్కడా రిజిష్టర్ అవ్వలేదు. కాకపోతే.. “మ మ మహేష్” సాంగ్ లో మాత్రం డ్యాన్స్ తో ఆకట్టుకుంది.
సముద్రఖని విలనిజాన్ని వీరలెవల్లో ప్రదర్శించినా.. క్యారెక్టరైజేష్ లో ఉన్న పట్టు ప్రెజంటేషన్ లో లేకపోవడంతో ఆ పాత్ర కూడా పేలవంగా తేలిపోయింది. అలాగే.. సుబ్బరాజు, తనికెళ్ళభరణి, వెన్నెల కిషోర్ ల పాత్రలు అలా వచ్చి వెళ్తూ ఉంటాయి.
సాంకేతికవర్గం పనితీరు: సినిమా మొత్తానికి తమన్ ఒక్కడే న్యాయం చేశాడు. పాటలు, నేపధ్య సంగీతంతో ఆడియన్స్ లో ఊపు తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు. సినిమాటోగ్రాఫర్ గా ఆర్.మధి వీకెస్ట్ సినిమాగా “సర్కారు వారి పాట”ను చెప్పుకోవచ్చు. మధి మార్క్ ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు. పైగా వైజాగ్ రోడ్ & బీచ్, డాగ్స్ వీ.ఎఫ్.ఎక్స్ చాలా పేలవంగా ఉన్నాయి. లాక్ డౌన్ టైంలో షూట్ చేయడం వల్లనో ఏమో కానీ.. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ఒక భారీ సినిమా స్థాయిలో అస్సలు లేవు. ఆఖరికి క్లైమాక్స్ లో వీ.ఎఫ్.ఎక్స్ కూడా తేలిపోతుంది. మహేష్ బాబు కెరీర్ లోనే ఈస్థాయి ఘోరమైన వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇప్పటివరకూ ఏ సినిమాకి లేదు.
మహేష్ బాబును కొత్తగా, ఆయన అభిమానులు కోరుకునే విధంగా ప్రెజంట్ చేద్దామన్న దర్శకుడు పరశురామ్ ఆలోచన బాగుంది. అయితే.. కొత్తగా ప్రెజంట్ చేయడంతోపాటు, క్యారెక్టర్ ను కూడా కొత్తగా ఎలివేట్ చేయాలి. కథ-కథనం విషయంలో పరశురామ్ చేతులెత్తేశాడు. మహేష్ లాంటి సూపర్ స్టార్ ను బోకుగాడు అని తిట్టించడం, అది కూడా అసందర్భంగా అనేది వీరాభిమానులు సైతం జీర్ణించుకోలేని విషయం.
అలాగే.. హీరోయిన్ మీద కాళ్ళేసుకొని పడుకొనే కామెడీ ట్రాక్, సుబ్బరాజు నెత్తి మీద ఉచ్చ పోసే కామెడీ ఎపిసోడ్ మరీ హేయంగా ఉన్నాయి. ఇది కచ్చితంగా మహేష్ బాబు రేంజ్ సినిమా కాదు, మహేష్ స్థాయికి పడాల్సిన ట్రాక్ & ఎపిసోడ్లు కావు ఇవి. ఒక సందేశం ఇద్దామనుకున్నప్పుడు.. ఆ సందేశాన్ని బాధ్యతతో ఇవ్వడం అనేది చాలా అవసరం.
“సరిలేరు నీకెవ్వరు”లోనూ ట్రైన్ ఎపిసోడ్ లేకిగా ఉన్నా.. సందేశం విషయానికి వచ్చేసరికి బాధ్యతగానే చెప్పాడు అనిల్ రావిపూడి. కానీ.. పరశురామ్ ఆ బాధ్యతను విస్మరించాడు. దాంతో ఇచ్చిన సందేశం జనాలకి ఎక్కలేదు. సో, పరశురామ్ దర్శకుడిగా-కథకుడిగా దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి.
విశ్లేషణ: కొన్ని కామెడీ సీన్లు, కొన్ని యాక్షన్ సీన్లు, మహేష్ బాడీ లాంగ్వేజ్ తప్పితే చెప్పుకోదగ్గ అంశం కానీ.. ఎంటర్టైన్మెంట్ కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేని సినిమా “సర్కారు వారి పాట”. మహేష్ వీరాభిమానులు, మాస్ కమర్షియల్ సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ మినహా మిగతా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడిన చిత్రం ‘సర్కారు వారి పాట”.
రేటింగ్: 2/5