Sathi Gani Rendu Ekaralu Review In Telugu: సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • గదీష్ ప్రతాప్ బండారి, రాజ్ తిరణ్ దాసు (Hero)
  • అనీషా దామా (Heroine)
  • వెన్నెల కిషోర్, వంశీధర్ గౌడ్, బిత్తిరి సత్తి (Cast)
  • అభినవ్ దండా (Director)
  • వై.రవిశంకర్ - నవీన్ ఏర్నేని (Producer)
  • జయ్ క్రిష్ (Music)
  • విశ్వనాధ్ రెడ్డి (Cinematography)
  • Release Date : మే 26, 2023

“పుష్ప” సినిమాతో విశేషమైన గుర్తింపు సంపాధించుకున్న నటుడు జగదీష్ ప్రతాప్. అతడు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “సత్తిగాని రెండెకరాలు”. రస్టిక్ విలేజ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నుండి వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ డార్క్ కామెడీ విలేజ్ హ్యూమర్ ఏమేరకు వర్కవుటయ్యిందో చూద్దాం..!!

కథ: ఊర్లో ఆటో నడుపుతూ, చిన్నపాటి అప్పులు చేస్తూ పెళ్ళాం-పిల్లలతో సంసారం నడుపుతుంటాడు సత్తి (జగదీష్ ప్రతాప్). పిల్లాడి గుండె ఆపరేషన్ కోసం డబ్బులు అవసరం పడడంతో.. ఆటోతోపాటు పొలం కూడా అమ్మేయాలనుకుంటాడు. కానీ.. చిన్నప్పుడు తాతయ్య ఎంతో ప్రేమతో రాసిచ్చిన రెండెకరాల భూమిని మాత్రం అమ్మబుద్ది కాదు సత్తిగాడికి. మహా సందిగ్ధావస్తాలో ఉన్న సత్తికి యాక్సిడెంట్ అయిన కారులో ఉన్న సూట్ కేస్ దొరుకుతుంది. ఆ సూట్ కేసును ఓపెన్ చేసి.. అందులో ఉన్న దాన్ని అమ్ముకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటాడు సత్తి.

అసలు ఆ సూట్ కేస్ లో ఏముంది? ఆ సూట్ కేస్ ను సత్తి సొమ్ము చేసుకోగలిగాడా? అనేది “సత్తిగాని రెండెకరాలు” కథాంశం.

నటీనటుల పనితీరు: నటన పరంగా సినిమాలో నటించిన ఏ ఒక్కరికీ పేరు పెట్టాల్సిన పని లేదు. జగదీష్ ప్రతాప్ బండారి, రాజ్ తిరణ్ దాసు, వెన్నెల కిషోర్, వంశీధర్ గౌడ్, బిత్తిరి సత్తి వంటి నటులందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే.. అనీషా దామా మాత్రం ఎందుకో ఈ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ లో మిస్ ఫిట్ లా మారింది. ఆమె డైలాగ్ డెలివరీ కావచ్చు లేదా.. ఆమె ఆహార్యం కావచ్చు. ఎందుకో సినిమా మూడ్ లో మిక్స్ అవ్వలేదు. వెన్నెల కిషోర్-బిత్తిరి సత్తి కాంబినేషన్ కామెడీ జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కిరణ్ తిరణ్ దాసు క్యారెక్టరైజేషన్ కూడా చక్కగా వర్కవుటయ్యింది.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు-రచయిత అభినవ్ దండా ఈ సినిమాకి ఎడిటర్ కూడా అవ్వడం పెద్ద మైనస్ అని చెప్పాలి. రాసుకున్న మరియు తెరకెక్కించిన సన్నివేశాల మీద అతి ప్రేమ కారణంగా ఎడిటింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించలేక సినిమాలోని అనవసరమైన ల్యాగ్ కు కారణమయ్యాడు. అయితే.. వెన్నెల కిషోర్ పాత్రతో పండించిన డార్క్ హ్యూమర్ మాత్రం బానే వర్కవుటయ్యింది.

ముఖ్యంగా.. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కంగారులో కిరణ్ క్యారెక్టర్ ను చంపే సన్నివేశాన్ని కంపోజ్ చేసిన తీరు ప్రశంసనీయం. రాసుకున్న కథ కంటే కథనానికి పెద్ద పీట వేశాడు అభినవ్. ముఖ్యంగా క్లైమాక్స్ లో జస్టిఫికేషన్ అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడిగా అభినవ్ ఆకట్టుకున్నాడనే చెప్పాలి.

ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీపడలేదు. ఆర్ట్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగున్నాయి.

విశ్లేషణ: 2011లో బాలీవుడ్ నుండి వచ్చిన “ఢిల్లీ బెల్లీ” అనే సినిమా ప్రేరణతో ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ప్రముఖమైనది “స్వామి రారా”. ఆ తరహా సినిమానే “సత్తిగాని రెండెకరాలు”. జగదీష్ నటన, డార్క్ హ్యూమర్, స్క్రీన్ ప్లే కోసం ఈ వెబ్ ఫిలిమ్ ను ఆహా యాప్ లో హ్యాపీగా చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus