సినిమాల్ని శుక్రవారం మాత్రమే రిలీజ్ చేయాలనే రూల్ లాంటిది ఏమీ లేకపోయినప్పటికీ.. గత కొన్ని దశాబ్ధాలుగా అది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఎప్పుడైనా ఏదైనా పండగ సందర్భాలను మినహాయిస్తే 99% సినిమాలన్నీ శుక్రవారమే విడుదలయ్యాయి. అందువల్ల సగటు సినిమా అభిమాని కూడా శుక్రవారం “సినిమా డే” అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. దాంతో ఈమధ్య గురువారం సినిమాలు రిలీజ్ అవుతుంటే “ఇవాళ శుక్రవారమా” అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అయితే.. గురు లేదా శుక్రవారం మాత్రమే సినిమాలు విడుదల చేయాలా.. శనివారం విడుదల చేయకూడదా అనుకొన్నారో ఏమో కానీ.. ఉన్నట్లుండి శనివారం తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు కొందరు చిత్ర నిర్మాతలు.
ఈ నెల 21న అనగా శనివారం “పరిచయం” అనే చిన్న సినిమా విడుదలవుతుండగా.. వచ్చే వారం 28న అనగా మరో శనివారం నిహారిక కొణిదెల-సుమంత్ అశ్విన్ జంటగా నటించిన “హ్యాపీ వెడ్డింగ్” కూడా శనివారమే విడుదలవుతోంది. నిజానికి.. శుక్రవారం విడుదల చేస్తే ఆరోజు సాయంత్రానికల్లా టాక్ ఏంటో తెలిసి శనివారం, ఆదివారం కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒకవేళ బాగుంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయి లేదంటే సినిమా సంగతి అయిపోయినట్లే. కానీ.. మన తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం అలవాటు లేని ఈ శనివారం విడుదలలు సినిమాలకు ఏమేరకు ఉపయోగపడతాయి అనేది ఈ రెండు సినిమాల కలెక్షన్స్ బట్టి తెలుస్తుంది.