‘హౌ ఈస్ థట్ ఫర్ ఏ మండే’పై శేఖర్ కమ్ముల ప్రశంసలు

  • October 26, 2023 / 11:36 AM IST

సాధారణంగా మండే (సోమవారం) అంటే కార్పొరేట్ ఆఫీసుల్లో, సాఫ్ట్ వేర్ కంపినీల్లో పనులు నిదానంగా మొదలవుతాయి. శనివారం, ఆదివారం సెలవునుండి తిరిగి వచ్చిన ఉద్యోగులలో ఒకటీ రెండు పూటలు స్తబ్ధత నెలకొని ఉంటుంది. అటువంటి ఒక మండే ఊహకందని మార్పులు చోటు చేసుకుంటే? ప్రియురాలితో గొడవతో మొదలై, అప్పులిచ్చిన వారి బెదిరింపులు, తనకేమాత్రం సంబంధం లేని ఒక క్రైమ్ లో ఇరుక్కోని, ఆపై దాదాపు ప్రాణాల మీదికి తెచ్చుకొని, ఇలా ప్రతి క్షణం ఊహకందకుండా శ్యామ్ కుమార్ అనే ఒక ఎన్.ఆర్.ఐ. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితం లోని ఒక మండే ని అమెరికాలోని సమకాలీన సామాజిక, ఆర్ధిక వ్యవహారాలతో ముడిపెడుతూ ఆద్యంతం ఆసక్తిగా సాగేలా తీసిన ఒక వ్యంగ్య కథా చిత్రమే “హౌ ఈస్ థట్ ఫర్ ఏ మండే”.

నైజాం టాకీస్, మినర్వా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మెన్ టూ, బ్రోచేవారెవరురా తదితర చిత్రాలలో నటించిన కౌశిక్ ఘంటసాల కథా నాయకుడిగా, ప్రముఖ అమెరికన్ నటులు క్యాండిడో కార్టర్, ఎలిస్టర్ ల్యాథం, మేగన్ బార్లో సహా నటులుగా నటించారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు డాన్ విన్సెన్ట్ నేపధ్య సంగీతం, మల్లేశం చిత్ర ఫెమ్ రాఘవేందర్ ఉప్పుగంటి కూర్పు సమకూర్చగా, హాలీవుడ్ లో శిక్షణ పొందిన శ్రీపాల్ సామా రచించి దర్శకత్వం వహించారు. సాయి ప్రణీత్ గౌరవరాజు సహ రచయితగా, ఎమ్మీ అవార్డు విజేత స్కాట్ వుల్ఫ్ శబ్దగ్రాహకుడిగా పని చేసారు.

పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ఎంపికై, శేఖర్ కమ్ముల, నగేష్ కుకునూర్ వంటి దర్శకుల మన్ననలు పొందింది ఈ చిత్రం. శేఖర్ కమ్ముల ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు. ‘సినిమాను చూశాను.. చాలా బాగా వచ్చింది.. చిన్న క్యూట్ ఫిల్మ్. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసెజ్ కూడా ఇచ్చారు. కౌశిక్ బాగా నటించాడు. డైరెక్టర్ శ్రీపాల్ అద్భుతంగా తీశాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. ఇంగ్లీష్ – తెలుగు భాషల్లో ఈ చిత్రం ఈ నెల 27న హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు తో పాటు అమెరికాలోని పలు నగరాల్లో విడుదల అవబోతుంది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus