సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు… ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో జూన్ 13,1957న రాజబాబు జన్మించారు. బాల్యం నుండి ఆయనకు నటనపై మక్కువ ఎక్కువ. దీంతో చిన్నతనంలోనే నాటకాలేస్తూ దేశమంతా తిరిగారు. ఈ క్రమంలో 1995లో ‘ఊరికి మొనగాడు’తో రాజబాబు నటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.
అలా ఒక్కో పాత్ర చేసుకుంటూ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ‘సింధూరం’, ‘సముద్రం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘మురారి’, ‘శ్రీకారం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కళ్యాణ వైభోగం’, ‘మళ్ళీ రావా?’, ‘బ్రహ్మోత్సవం’, ‘భరత్ అనే నేను’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. మొత్తంగా ఆయన తన కెరీర్‌లో 62 చిత్రాల్లో నటించారు.
సినిమాలతోపాటు రాజబాబు… కొన్ని టీవీ సిరియల్స్‌లోనూ నటించారు. ‘మనసు మమత’, ‘బంగారు కోడలు’, ‘వసంత కోకిల’, ‘చి ల సౌ స్రవంతి’ ‘అభిషేకం’, ‘రాధా మధు’, ‘బంగారు పంజరం’, ‘నా కోడలు బంగారం’, తదితర సీరియళ్లతో టీవీ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నారు. 2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకుగానూ ఆయనకు నంది పురస్కారం దక్కింది. రాజబాబును టాలీవుడ్‌లో అందరూ బాబాయ్ అని ప్రేమతో పిలుస్తుంటారు.