ఎలాంటి భావాన్ని అయినా సులువుగా పలికించగల నటిగా జయంతి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అనారోగ్య సమస్యల వల్ల జయంతి కన్నుమూయగా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని తనది కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి అని ఆమె చెప్పుకొచ్చారు. తాను గోల్డెన్ స్టూడియాలో డ్యాన్స్ నేర్చుకునే సమయంలో ఒక నిర్మాత తనను చూసి సినిమా ఆఫర్ ఇచ్చారని ఆమె చెప్పారు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన జగదేకవీరుని కథ సినిమాలో చిన్న పాత్రతో నటిగా తాను కెరీర్ ను మొదలుపెట్టానని జయంతి వెల్లడించారు. ఆ తర్వాత తాను సుమంగళి అనే సినిమాలో నటించానని ఆ సినిమాలో శోభన్ బాబు తనపై చేయి వేయగానే తనకు ఎలా నటించాలో అర్థం కాలేదని ఆమె అన్నారు. ఆ తర్వాత కె విశ్వనాథ్ ” ఏయ్ బండపిల్లా ఏంటి అలా నిలుచున్నావ్? అబ్బాయి చేయి వేయగానే ఎలా పులకరించాలో తెలీదా..?” అని చెప్పగా తనకు తెలియదని బదులిచ్చానని జయంతి తెలిపారు.
ఆ తర్వాత విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన శారద, సూర్యకిరణం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించానని ఆమె చెప్పుకొచ్చారు. కన్నడలో డేట్లు సర్దుబాటు చేయలేక ఏఎన్నార్ పక్కన హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని ఆమె చెప్పారు. బంగారు బాబు సినిమాలో అంధురాలిగా నటించానని ఏఎన్నార్, ఎస్వీఆర్ ఇచ్చిన సలహాల వల్ల ఆ పాత్రకు అంత గుర్తింపు వచ్చిందని జయంతి వెల్లడించారు.