సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం దర్శకుడిగా మారి ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి షాజీ ఎన్.కరుణ్. మలయాళంలో సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ లో ఒకరు. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి అగ్రశ్రేణి తారలు హీరోలుగా సినిమాలు తెరకెక్కించిన షాజీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు. మలయాళం సినిమా స్థాయిని, సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడిగా షాజీని పేర్కొంటారు.
అటువంటి షాజీ ఎన్.కరుణ్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ.. నిన్న (ఏప్రిల్ 28, సోమవారం, 2025) 73 ఏళ్లకు కన్ను మూశారు. 70ల కాలంలో మలయాళం ఇండస్ట్రీని ఏలిన టెక్నీషియన్స్ లో షాజీ ఒకరు. గత ఏడాది కేరళ ప్రభుత్వం ఆయన్ను “జేసీ డానియల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్”తో సత్కరించుకుంది. 2011లోనే ఆయన గొప్పతనానికి భారతీయ ప్రభుత్వం పద్మశ్రీతో షాజీని గౌరవంగా సత్కరించింది. ఇక ఎన్నో కేరళ స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న షాజీని మలయాళ చిత్రసీమ గురువు స్థానంలో చూసుకుంటుంది.
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా (బ్లాక్ & వైట్), ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నిర్మాతగా.. ఇలా మూడు విభిన్నమైన కేటగిరీల్లో నేషనల్ అవార్డ్ అందుకున్న ఏకైక వ్యక్తి షాజీ. దర్శకుడిగా తొలి చిత్రం “పిరవి” (1989)తోనే ఎన్నో సంచలనాలు సృష్టించారు షాజీ. ఆయన మరణం మలయాళ చిత్రసీమకు మాత్రమే కాదు భారతీయ చిత్రసీమకు కూడా తీరని లోటు.
ఆయన్ను వరల్డ్ సీనిమా ఐకాన్ గా పేర్కొన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్. నేడు (ఏప్రిల్ 29) షాజీ ఎన్.కరుణ్ పార్థివదేహానికి ఆయన స్వస్థలమైన తిరువనంతపురంలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆయన సతీమణి అనసూయ వారియర్, కుమారులు అప్పు అరుణ్, కరుణ్ అనిల్ ఈ కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు.