సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ఈడీ నోటీసులు అందడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల సురానా గ్రూప్‌పై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా, వేల కోట్ల రూపాయల బ్యాంకు మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంలో కొన్ని సంబంధాలు ఉన్నట్లు అనుమానంతో మహేష్‌ను కూడా విచారణకు పిలవడం జరిగింది.
ఈడీ నుంచి వచ్చిన నోటీసుపై మహేష్ బాబు అధికారులకు తన స్పష్టమైన వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో సాయిసూర్య డెవలపర్స్ సంస్థతో మహేష్ బాబు లింక్ ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే మహేష్ బాబు తాను నేరుగా ఏ లావాదేవీలలోనూ భాగస్వామి కాదని, కేవలం బ్రాండ్ ఎంబాసిడర్ లాంటి ఫార్మల్ అనుబంధం మాత్రమే ఉందని పేర్కొన్నారట. తన పేరు అవసరం లేని విధంగా ఈ వ్యవహారంలో లాగడం సరికాదని నర్మదంగానే తన వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
విచారణ అనంతరం దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబు (Mahesh Babu) తాజా అభ్యర్థన కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న మహేష్, ఏప్రిల్ 28న విచారణకు హాజరు కాలేనని అధికారులను కోరారు. కొత్త తేదీ ఇవ్వాలని మెయిల్ ద్వారా అధికారికంగా విజ్ఞప్తి చేశారని సమాచారం. మహేష్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా షూటింగ్‌లో నిమగ్నమయ్యారు. అందువల్ల తాను ప్రస్తుత షెడ్యూల్ నుంచి రిలీవ్ కావడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
ఈడీ అధికారులు మహేష్ బాబు అభ్యర్థనను పాజిటివ్‌గా తీసుకుని, త్వరలో కొత్త డేట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ మహేష్ ఈడీ విచారణలో ఏం వివరణ ఇవ్వనున్నారు అనేది చర్చకు దారితీస్తోంది. మహేష్ బాబు స్పందనపై ఆధారపడి ఈ కేసులో తనపై ఆరోపణల్ని పూర్తిగా క్లియర్ చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.