టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి స్టార్ స్టేటస్ తో సత్తా చాటిన దర్శకులు (Directors) ప్రస్తుతం కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక మూస సినిమాలు తీస్తూ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేస్తున్నారు. బాహుబలి2 (Baahubali 2), ఆర్.ఆర్.ఆర్ (RRR) , సలార్ (Salaar) , కల్కి(Kalki) , హనుమాన్ (Hanuman) లాంటి నవ్యతతో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండగా మరి కొందరు డైరెక్టర్లు మాత్రం రొటీన్ మాస్ మసాలా సినిమాలను తెరకెక్కిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఒకప్పుడు మాస్ సినిమాలతో సత్తా చాటిన వినాయక్ (V. V. Vinayak) ఛత్రపతి (Chatrapathi) సినిమాను హిందీలో రీమేక్ చేసి ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నారు. వినాయక్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయి కానీ కొంతకాలం తర్వాత ఆ ప్రాజెక్ట్స్ మొదలవుతాయని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఒకప్పుడు తెరకెక్కించిన ప్రతి సినిమా అద్భుతం కాగా ఈ మధ్య కాలంలో ఆయన సక్సెస్ రేట్ మాత్రం తగ్గిందనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) స్కంద (Skanda) సినిమాతో ప్రేక్షకులను నిరాశకు గురి చేశారు.
మరో స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) సైతం మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమాతో నిరాశ పరిచారు. కొరటాల శివ (Koratala Siva) ఆచార్య (Acharya) సినిమాతో అభిమానులను తీవ్రస్థాయిలో నిరుత్సాహానికి గురి చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) గుంటూరు కారం (Guntur Kaaram) కమర్షియల్ గా పరవాలేదనిపించినా ఈ సినిమా నచ్చని అభిమానుల సంఖ్య సైతం ఎక్కువగానే ఉంది. మరి కొందరు దర్శకుల పేర్లు అనవసరం కానీ ఆ డైరెక్టర్లు తీస్తున్న సినిమాలకు బడ్జెట్ లో పావు వంతు కలెక్షన్లు కూడా రావడం లేదు.
క్వాలిటీ కంటెంట్ పై ఫోకస్ పెట్టిన దర్శకుల సినిమాలు సంచలనాలు సృష్టిస్తుండగా మిగతా సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేస్తున్నాయి. ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించేలా కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.