ఒకానొక సమయంలో ఆ హీరో గురించి మాట్లాడుతూ.. సినిమా జనాలు ‘ఇక ఆయన కెరీర్ అయిపోయింది’ అని హార్స్ కామెంట్ చేశారు. దానికి ఓ కారణం కూడా ఉందనుకోండి. ఆయన ఏ సినిమా చేసినా బ్లాక్‌బస్టర్ అయ్యే పరిస్థితి నుండి.. మోస్తరు విజయం వచ్చినా చాలు అనే పరిస్థితి వచ్చింది ఆ హీరోకి. అయితే ఆ పరిస్థితి నుండి రెండు భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మంచి విజయం కూడా అందుకున్నాడు.
ఇదంతా ఎవరి గురించి అనేది మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్ లాంటివి ఉంటే.. ఆయనే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అని చెప్పేస్తాం. గతేడాది హ్యాట్రిక్ విజయాలతో మొత్తంగా ఇండియన్ సినిమాలో తన సత్తా ఏంటో చాటాడు షారుఖ్. అయితే ఆయన హాలీవుడ్‌కి వెళ్తాడు అనే కామెంట్లు ఆ మధ్య వచ్చాయి. తర్వాత ఆగిపోయాయి. ఇప్పుడు వరుస విజయాల జోరు మీదున్నాడు కాబట్టి.. ఇప్పుడు వెళ్తాడేమో అనే చర్చ మొదలైంది.
తాజాగా ఈ ప్రశ్నలకు షారుఖ్ ఖాన్ క్లారిటీ ఇచ్చేశాడు. కొత్తగా వచ్చిన బాలీవుడ్ నటులే హాలీవుడ్ వైపు వెళ్తున్నారు.. మరి మూడు దశాబ్దాలకు పైగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న మీరు ఇప్పటివరకూ హాలీవుడ్‌లో ఎందుకు అడుగుపెట్టలేదు అనే ప్రశ్న మరోసారి ఆయన ముందుకొచ్చింది. ఈసారి భలే ఆన్సర్ చెప్పి ఇక ఆ చర్చ జరగకుండా చూసే ప్రయత్నం చేశాడు.
ఇంగ్లిష్ సినిమాల్లో నటించాలంటే.. ఆ పాత్ర భారతీయ అభిమానుల్ని మెప్పించేలా ఉండాలి అనేది తన కోరిక అని చెప్పిన షారుఖ్ ఖాన్.. ఇప్పటివరకు హాలీవుడ్‌లో అడుగుపెట్టాలనే ఆలోచన రాలేదని క్లారిటీ ఇచ్చేశాడు. అయినా ఇంగ్లిష్ సినిమాలు చేయాలంటే కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని అసలు విషయం చెప్పాడు. ఇంగ్లిషు బాగా మాట్లాడగలను అనిపించినప్పుడే హాలీవుడ్ ప్రాజెక్టును అంగీకరిస్తాను అని తేల్చేశాడు. ఆ రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.