రజినీకాంత్ ‘జైలర్’ సినిమా విజయంలో నెల్సన్ టేకింగ్ ఎంత ఉందో, అందులో వచ్చిన అతిథి పాత్రల ప్రభావం కూడా అంతే ఉంది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ స్క్రీన్ మీద కనిపించిన ఆ కొద్ది నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను రెట్టింపు చేయడానికి నెల్సన్ సిద్ధమవుతున్నాడు. 2026 జూన్‌లో రాబోతున్న ‘జైలర్ 2’ కోసం ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను రంగంలోకి దింపుతున్నారనే వార్త కోలీవుడ్‌ను ఊపేస్తోంది.
JAILER 2
మొదటి భాగంలో వర్కవుట్ అయిన ఈ ‘క్యామియో ఫార్ములా’ను ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ ‘కూలీ’లో కూడా ఇలాంటి ప్రయత్నమే చేసినా, అది జైలర్ రేంజ్‌లో క్లిక్ అవ్వలేదు. నెల్సన్ మాత్రం ఈ విద్యలో ఆరితేరిపోయాడు. స్టార్లను ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈసారి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రీచ్ కోసం షారుఖ్ కోసం ట్రై చేస్తున్నాడు.
నిజానికి ఈ పాత్ర కోసం మన నటసింహం బాలకృష్ణను కూడా సంప్రదించారట. కానీ బాలయ్య ఎందుకో ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. బహుశా నిడివి తక్కువగా ఉండటమో, లేదా ప్రాధాన్యత నచ్చకపోవడమో కారణం కావచ్చు. బాలయ్య నో చెప్పడంతో, ఇప్పుడు మేకర్స్ ఫోకస్ షారుఖ్ మీద పడింది. కింగ్ ఖాన్ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, డిసెంబర్లోనే షూటింగ్ పెట్టుకోవాలని చూస్తున్నారు.
షారుఖ్ ఖాన్‌కు రజినీకాంత్ అంటే అభిమానం. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ టైమ్‌లోనే లుంగీ డ్యాన్స్ తో తలైవా మీద ప్రేమను చాటుకున్నాడు. కాబట్టి నెల్సన్ చెప్పే కథ, ఆ పాత్ర నచ్చితే షారుఖ్ నో చెప్పకపోవచ్చు. పైగా ఇది కేవలం గెస్ట్ రోల్లా కాకుండా, కథను మలుపు తిప్పే బలమైన పాత్ర అని ఇన్సైడ్ టాక్.
ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా రికార్డులు బద్దలవుతాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న నెల్సన్, ఈ ఒక్క కాస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి తలైవా కోసం బాద్‌షా దిగివస్తాడా? నెల్సన్ కోరిక నెరవేరుతుందా? అనేది త్వరలోనే తెలియనుంది.
