ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ గాయపడ్డాడా? బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా షారుఖ్ తీవ్ర గాయాలపాలయ్యారు అని తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. గాయపడిన వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం హాస్పిటల్ కి తరలించగా.. ఇప్పుడు విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు అని మరో వార్త కూడా వినిపిస్తోంది. తన కొత్త సినిమా ‘కింగ్’ చిత్రీకరణలో భాగంగానే ఈ ప్రమాదం జరిగింది అని చెబుతున్నారు.
ఈ ఘటన ఈ రోజు జరిగింది అని కొందరు అంటుంటే.. కాదు ఇటీవల జరిగింది అని కూడా చెబుతున్నారు. తన కుమార్తె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్’లో షారుఖ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌లోనే గాయాలపాలయ్యాడు అని చెబుతున్నారు. స్థానిక వైద్యులు పరిశీలించి, తగు వైద్యం చేసి ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. దీని కోసం షారుఖ్ విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో షారుఖ్ టీమ్ నుండి ఎలాంటి సమాచారం అయితే లేదు.
ముంబయిలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో ‘కింగ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడే షారుఖ్ గాయపడ్డారని చెబుతున్నారు. షారుఖ్ కండరాలకు తీవ్రంగా గాయమైందని చెబుతున్నారు. గతంలోనూ షారుఖ్ కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ సమస్య తిరగబెట్టింది అని అంటున్నారు. అలాగే ఇప్పటిది పెద్ద గాయం కాదు అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు అని షారుఖ్ సన్నిహితులు చెబుతున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఇదంతా జరిగి కొన్ని రోజులవ్వగా.. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది అంటున్నారు.
ఎందుకంటే షూటింగ్‌ను సెప్టెంబరుకు వాయిదా వేశారు అని సమాచారం. ఏదేమైనా షారుఖ్ తనయ సుహానా ఖాన్ తొలి సినిమా షూటింగ్‌లో ఇలాంటి ఘటన జరగడం బాధాకారమే. అయితే షారుఖ్‌కి ఎలా గాయమైంది అనేది మాత్రం తెలియడం లేదు.