సినీ పరిశ్రమలో సక్సెస్ అనేది చాలా ముఖ్యం. అది ఉంటేనే..వరుస ఆఫర్లు వస్తాయి. ఇమేజ్ పెరుగుతుంది. పారితోషికం పెరుగుతుంది. కానీ మొదటి అవకాశం దక్కినప్పుడు దానిని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మొదట తీసిన సినిమా ప్లాప్ అయితే.. కొంతమందికి 2వ అవకాశం రాదు. దీంతో కొంతమంది ప్లాప్ సినిమాని తమ ఖాతా నుండి డిలీట్ చేయాలని అనుకుంటారు.
టాలీవుడ్లో ఉన్న చాలా మంది దర్శకులు మొదటి సినిమా ప్లాప్ అయితే.. తర్వాత గ్యాప్ ఇచ్చి రెండో సినిమా చేస్తే.. దానినే మొదటి సినిమాగా చెప్పుకుంటారు. ఎందుకంటే మొదటి తీసిన ప్లాప్ సినిమా వల్ల క్రెడిబిలిటీ పోకుండా ఉండాలని. ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు.
అది పక్కన పెడితే.. 2004లో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘విజయేంద్రవర్మ’ అనే సినిమా వచ్చింది. ఇది పెద్ద డిజాస్టర్ మూవీ. ఫలితం సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమా వల్ల బాలకృష్ణ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయారు. ఈ సినిమాలో చేసిన డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, ఇంకా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కానీ.. చాలా దారుణంగా ఉంటాయి. ఈ సినిమాకి స్వర్ణ సుబ్బారావు దర్శకుడు. ‘విజయేంద్రవర్మ’ తర్వాత ఈయనకు అవకాశాలు రాలేదు.
4 ఏళ్ళ తర్వాత కళ్యాణ్ రామ్ ఇతనికి ఛాన్స్ ఇచ్చాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే ‘హరే రామ్’. 2008 జూలై 18న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. విజయేంద్ర వర్మ ఇంపాక్ట్ ఈ సినిమాపై పడకూడదు అని భావించి ‘హరే రామ్’ సినిమాకి హర్షవర్ధన్ గా పేరు వేసుకున్నారు స్వర్ణ సుబ్బారావు. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మించడం మరో విశేషం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.