శర్వానంద్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టు ఉంది. 2018 లో వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ సినిమా నుండీ అతన్ని ప్లాప్ లు వెంటాడుతున్నాయి. ‘రణరంగం’ ‘జాను’ వంటి సినిమాలు కూడా ఘోరపరాజయం పాలయ్యాయి. తాజాగా వచ్చిన ‘శ్రీకారం’ చిత్రం పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది. మొదటి నుండీ ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. పాటలు, టీజర్, ట్రైలర్ లు సినిమా పై హైప్ ఏర్పడేలా చేసాయి. సినిమా చూసిన వాళ్ళు కంటెంట్ బాగుంది, మంచి సినిమా అని ప్రశంసించారు. దర్శకుడు కిషోర్ లో కూడా ట్యాలెంట్ ఉందని సినీ విశ్లేషకులు సైతం ఒప్పుకున్నారు.
నిర్మాతలైన ’14 రీల్స్ ప్లస్’ వారు ప్రమోషన్లకు ఎక్కడా లోటు చెయ్యలేదు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది ‘శ్రీకారం’. దానికి గల కారణాలు కూడా లేకపోలేదు. సినిమాని ఎక్కువ రేట్లకు అమ్మడం ఒకటైతే.. టికెట్ రేట్లను కూడా పెంచడం అనేది మరో కారణం. ‘రైతుల కోసం తీసిన సినిమాని.. రైతులే చూడలేకపోతున్నారు’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు కొంతమంది నెటిజన్లు. ఇక ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొనడం ఇష్టం లేక ‘శ్రీకారం’ ను ఓటిటిలో చూసుకోవచ్చులే అని లైట్ తీసుకున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే.. ‘జాను’ ‘శ్రీకారం’ చిత్రాలను శర్వా చాలా మనసు పెట్టి చేసాడట. అయినప్పటికీ అవి చేదు అనుభవాన్ని మిగల్చడం పట్ల శర్వా డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ‘శ్రీకారం’ సినిమాతో హిట్టు చేతికందినట్టే అంది.. మిస్ అయిపోవడం పట్ల ఎక్కువ ఫీలవుతున్నట్టు సమాచారం. ఈ ఏడాది శర్వా నుండీ ‘మహాసముద్రం’ చిత్రం కూడా రాబోతుంది. మరి దాంతో అయినా అతను హిట్టు అందుకుంటాడేమో చూడాలి..!