యువ కథానాయకుడు శర్వానంద్ త్వరలో ‘బైకర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్ రేసర్‌గా సీరియస్ లుక్‌లో రిలీజ్ చేసిన పోస్టర్లు, ప్రచార వీడియోలు వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ ఏదో కొత్తగా ట్రై చేసినట్లు ఉన్నాడు అంటూ సినిమా మీద ఓ స్థాయి హైప్ అయితే క్రియేట్ అయింది. గత కొన్ని సినిమాలుగా శర్వాకు సరైన విజయం లేకపోవడంతో ఈ సినిమా ఫలితం చాలా కీలకం అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో మరో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న మూడ్‌ను శర్వా మార్చాలని అనుకుంటున్నాడట.
అవును, వినోదాల దర్శకుడు శ్రీను వైట్ల డైరక్షన్‌లో శర్వానంద్ ఓ సినిమా చేస్తాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసుకొని ఆ సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం వైట్ల స్టైల్ కామెడీని, ఓ ట్విస్ట్ కథను ఎంచుకుంటున్నారట. తెలిసీ తెలియని వయసులో, ఆవేశంలో చేసిన పని ఓ కుర్రాడి జీవితంలో, కుటుంబంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేదే సినిమా కథ అని చెబుతున్నారు.
కుర్రాడి జీవితంలో జరిగే సంఘటనలు కామెడీగా సాగుతాయని. లవ్ ట్రాక్ వినోదాత్మకంగా ఉంటాయని చెబుతున్నారు. కామెడీ, లవ్ ట్రాక్, ట్విస్ట్‌లు కలిపి సినిమానున ఎంగేజింగ్‌గా మార్చేందుకు ప్రస్తుతం శ్రీను వైట్ల అండ్ టీమ్ పని చేస్తోంది అని చెబుతున్నారు. గతంలో చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా ప్లాన్ చేస్తున్నారని, ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా సాలిడ్‌గా జాగ్రత్తలు తీసుకుంటోంది అని సమాచారం.
ఇక శర్వానంద్ చేతిలో ప్రస్తుతం ‘బైకర్’, ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘భోగి’ సినిమాలు ఉన్నాయి. అందులో మధ్యలోని సినిమా ప్రచారం చాలా నెలల క్రితమే మొదలైనా ఆ తర్వాత సడీ సప్పుడు లేదు. చూద్దాం ‘బైకర్’ విడుదలయ్యాక ఈ సినిమాల విషయంలో కదలిక వస్తుందేమో.