మొక్క ఎంతుందో బయటకు కనిపిస్తుంది. కానీ దాని వేళ్లు ఎంత పెద్దవిగా ఉంటాయి.. అలా ఓ సినిమా గురించి బయటకు తెలిసే విషయాలు కన్నా.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ముందు జరిగిన విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. వాటిలో కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఉంటాయి. దాదాపు అన్ని సినిమాలకూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. తాజాగా ఇలా చాలా ఏళ్లపాటు శ్రమించి ఓకే చేయించుకుని, పట్టాలెక్కి, ఇప్పుడు విడుదలవుతున్న సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.
కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భజే వాయువేగం’ (Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్ సోదర సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే దీని వెనుక నాలుగేళ్ల కష్టం ఉందట. ఈ విషయాన్ని ప్రముఖ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) చెప్పుకొచ్చాడు. ‘భజే వాయువేగం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన శర్వ.. ఈ మేరకు కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కథానాయకులు ఒక్కొక్కరు ఒక్కో తరహా కథలు చేస్తుంటారు. మాస్, యాక్షన్, కామెడీ… ఇలా అన్నీ చేయగల ఓ ఆల్‌రౌండర్ కార్తికేయ అని పొగిడేసిన శర్వ.. కార్తికేయ సూపర్ స్టార్ అవుతాడని నమ్మకంగా చెప్పాడు. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ ‘రన్ రాజా రన్’ (Run Raja Run) సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశారట. అప్పుడే మాస్ కథల చుట్టూ తిరిగేవారట. ఇప్పుడు ‘భజే వాయు వేగం’ చేశారు. హిట్ కూడా కొడతాడు అని శర్వ చెప్పాడు.
ఇక కార్తికేయ గురించి చెబుతూ.. మూడు నాలుగేళ్లుగా ఈ స్క్రిప్ట్‌ని నమ్మి, పట్టుకుని తిరిగి చేసిన సినిమా ఇది అని చెప్పాడు. కథను నమ్మి సినిమాలు చేస్తే తప్పకుండా విజయవంతం అవుతామని చెప్పిన శర్వ.. తాను 20 ఏళ్లుగా ఇలానే ఉంటున్నా అని కూడా చెప్పాడు. మరి శర్వ నమ్మకం నిజమవుతుందా? చాలా రోజుల తర్వాత కార్తికేయ విజయం అందుకుంటాడా చూడాలి.