నితిన్ హీరోగా ‘ఛల్ మోహనరంగ’ అనే సినిమాను తెరకెక్కించారు రైటర్ కమ్ దర్శకుడు కృష్ణచైతన్య. ఈ సినిమా ఏవరేజ్ గా ఆడింది. సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు కృష్ణచైతన్య మరో సినిమాను మొదలుపెట్టలేదు. మొన్నామధ్య శర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
మొత్తానికి కృష్ణచైతన్య ఓ సినిమా సెట్ చేసుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఆ సినిమాను శర్వానంద్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శర్వానంద్ ఎందుకు ఈ సినిమాను పక్కన పెట్టారనేది తెలియదు కానీ ప్రస్తుతానికి మరో డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో చేయాలని అనుకుంటున్నారట.
మొదట ఓకే అనుకొని.. పూజా కార్యక్రమాలు చేసిన తరువాత సినిమా వద్దనుకోవడానికి గల కారణాలు బయటకు రాలేదు. పూర్తిగా పక్కన పెట్టారా..? లేక హోల్డ్ లో పెట్టారా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. ఇదిలా ఉండగా.. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. బహుశా ఆ సినిమానే పీపుల్ మీడియా బ్యానర్ లో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇటీవల ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సక్సెస్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అందుకే ఆచి తూచి సినిమాలు ఎన్నుకుంటున్నారు. రీమేక్ సినిమాలు చేయకూడదని నినాయించుకున్నారు. అలానే కొత్త తరహా కథల కోసం చూస్తున్నారు.