శతమానం భవతి

కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన చిత్రం “శతమానం భవతి”. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం దిల్ రాజు టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ ను అయినా అలరించగలిగిందో లేదో చూద్దాం..!!

కథ : ఆత్రేయపురం ఊరి పెద్ద రాఘవరాజు (ప్రకాష్ రాజ్) ఆయన భార్య జానకమ్మ (జయసుధ) తమ సంతానమైన ముగ్గురు పిల్లలు తమకు దూరంగా విదేశాల్లో సెటిల్ అవ్వడంతో.. అన్నీ ఉన్నా ఆనందం లేక పిల్లలెప్పుడు వస్తారా అనే దిగులుతో జీవితం వెళ్లదీస్తుంటాడు. ఎన్నిసార్లు పండక్కి రమ్మని పిలిచినా పిల్లలు రాకపోవడంతో.. కట్టుకున్న భార్య కంటతడి పెట్టడం చూడలేక.. “నేను మీ అమ్మకి విడాకులు ఇచ్చేస్తున్నాను, వచ్చి మీ అమ్మని తీసుకెళ్ళండి” అని రాఘవరావు తన పిల్లలకు “మెయిల్” పంపుతాడు. అప్పటివరకూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాని కొడుకులూ-కూతురు, ఒక్క ఈ మెయిల్ తో హుటాహుటిన ఆత్రేయపురంలో వాలిపోతారు.

అదే ఆత్రేయపురంలో ఇంజనీరింగ్ చేసి కూడా తాతయ్య మీద గౌరవంతో సిటీకి ఉద్యోగం కోసం వెళ్లకుండా ఉండిపోయిన రాజు, అప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నిత్య (అనుపమ పరమేశ్వరన్) ప్రేమలో పడతారు. అక్కడ విడిపోవడానికి రెడీగా ఉన్న పాత జంట, ఇక్కడ కలవడానికి కంగారు పడుతున్న కొత్త జంట. ఈ రెండు జంటల నడుమ నడిచే కుటుంబ కథా చిత్రమే “శతమానం భవతి”.

నటీనటుల పనితీరు : శర్వానంద్ ఈ సినిమాలో పేరుకి హీరో అయినప్పటికీ.. ఎక్కడా హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు లేకపోవడంతో ఒన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ గానే మిగిలిపోయాడు. అయితే.. గోదావరి యాసలో మాట్లాడాలని చేసిన ప్రయత్నం మాత్రం దెబ్బ కొట్టింది. అనుపమ అందంగా కనిపించింది. హావభావాల ప్రకటనలోనూ పరిణితి చూపించింది. ప్రకాష్ రాజ్-జయసుధలు మరోమారు భార్యాభర్తలుగా పెర్ఫార్మెన్స్ తో సన్నివేశాలను పండించడంతోపాటు ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను లీనం చేశారు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : మిక్కీ జె.మేయర్ సంగీతం వినసోంపుగా ఉంది. నేపధ్య సంగీతంతో సన్నివేశంలోని ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేయగలిగాడు. సమీర్ రెడ్డి తన కెమెరా కంటితో పల్లెటూరి అందాలను, ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా వెండితెరపై చూపించారు. దిల్ రాజు నిర్మాణ విలువలు, ఎడిటింగ్, లైటింగ్ లాంటివి కథకు అవసరమైన మేరకు బాగున్నాయి.

ఈ చిత్రానికి కథ-స్క్రీన్-మాటలు-దర్శకత్వం వంటి బాధ్యతలు నిర్వర్తించిన విధానం బాగానే ఉన్నా.. అందుకు ఎంచుకొన్న కథ మాత్రం చాలా పాతది. పిల్లలపై తల్లిదండ్రులు బెంగ పెట్టుకోవడం, తండ్రి లీడ్ తీసుకొని ఏదో ఒక కారణం చేత పిల్లల్ని ఊరికి తిరిగి రప్పించడం లాంటి కథాంశంతో ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేశాం. ఇక కుటుంబ సభ్యులందరూ ఒక చోట కలిసి ఆనందంగా ఆప్యాయతలు పంచుకొనే సన్నివేశాలైతే అప్పుడెప్పుడో పదహారేళ్ళ క్రితం “కలిసుందాం రా” సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి.. ఈ సినిమాలోని నటీనటులు ఎంత ఆప్యాయత నటించినా “ఎప్పుడు అవే సీన్లా ?” అన్నట్లుగా ఉంటుంది. “డబ్ స్మాష్” ఎపిసోడ్ ద్వారా పాత్రల మనసులోని మాటలను అందంగా ఆవిష్కరించిన విధానం బాగుంది. భారీ స్టార్ క్యాస్టింగ్, పల్లెటూరి కథాంశంతో చిత్రాన్ని నడిపించాలని దర్శకుడు సతీష్ వేగేశ్న ప్రయత్నం బాగానే ఉంది కానీ.. ఇప్పటికే ఈ తరహా చిత్రాలు వందల సంఖ్యలో వచ్చేయడం, ఈ తరహా చిత్రాలు చూసి చూసి ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేయడంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ వరకూ పర్లేదేమో కానీ.. సింగిల్ స్క్రీన్స్, మాస్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించడం కష్టమే.

విశ్లేషణ : కొత్తదనం అనేది ఎక్స్ పెక్ట్ చేయకుండా.. ఇప్పటికే ముప్పాతికసార్లు చూసేసిన కుటుంబ బాంధవ్యాలు, తల్లీదండ్రుల అనురాగాలు, అమ్మమ్మ తాతయ్యల ఆప్యాయతలు మరోసారి ఆశ్వాదిద్దామనుకొనేవారు మాత్రమే చూడాల్సిన చిత్రం “శతమానం భవతి”. ఓ అయిదారు సన్నివేశాలు మినహా మిగతా సినిమా మొత్తం పాత చింతకాయ పచ్చడిని తలపించే ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించడం కష్టమే!

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus