‘పొరిగింటి పుల్లకూర’ రుచి అన్నట్టు మన తెలుగు ప్రేక్షకులకి పర బాషా చిత్రాలంటే చాలా ఇష్టమంటున్నారు కొంతమంది నెటిజన్లు. ఓ పక్కన హిందీ ప్రేక్షకులే మన సినిమాలంటే పడి చస్తున్నారు. ఇక కొంతమంది బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు కూడా మన తెలుగు సినిమాల హక్కుల్ని కొనుక్కుని రీమేక్ చేస్తున్నారు. కానీ మన తెలుగులో వచ్చిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని మనం పట్టించుకోకుండా.. ఇదే కథల్ని తిప్పి తిప్పి తీసే పరభాషా చిత్రాలకి మనం మక్కువ చూపిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ఏం పాపం చేశాడు’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రం ఆగష్టు 2 న(నిన్న) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. చాన్నాళ్లకు బెల్లంకొండ ఓ హిట్టు కొట్టాడు అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతేడాది తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ‘రాట్ససన్’ చిత్రానికి ఇది రీమేక్. కాగా గతంలో ఇలాంటి చిత్రాలు మన తెలుగులో కూడా వచ్చాయని.. కానీ మన ప్రేక్షకులు అప్పుడు పట్టించుకోకుండా ప్లాప్ చేసారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొంచెం డెప్త్ కు వెళ్తే… గతంలో రవిబాబు ‘అనసూయ’ ‘అమరావతి’ వంటి చిత్రాలు తెరకెక్కించాడు. వీటిలో ‘అనసూయ’ చిత్రం పర్వాలేదనిపించినా ‘అమరావతి’ చిత్రం ప్లాపయింది. అయితే ‘రాట్శాసన్’ చిత్రం చాలా వరకూ ‘అనసూయ’ ‘అమరావతి’ చిత్రాలకి దగ్గరగా ఉందని వారు చెప్పుకొస్తున్నారు. అయితే ఇలా కామెంట్స్ చేసే వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి.. సస్పెన్సు థ్రిల్లర్స్ తెరకెక్కించే దర్శకులు ప్రేక్షకుల్లో ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయగలగాలి. ‘అనసూయ’ చిత్రం పర్వాలేదనిపించినా.. ‘అమరావతి’ చిత్రంలో అది బాగా లోపించింది. అందుకే ప్రేక్షకులు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు. కానీ రాక్షసుడు(రాట్శాసన్) చిత్రం అలా కాదు.. మొదటి 15 నిమిషాలకే ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది… ఇంటర్వెల్ కూడా వద్దు అనేలా ప్రేక్షకుడిని సీట్లకి కట్టి పడేస్తుంది. సో సస్పెన్స్ థ్రిల్లర్ కు అలాంటి లక్షణాలు ఉండాలి. లేకపోతే ఎంత క్రియేటివిటీ ఉన్నా వ్యర్ధమే అనడంలో సందేహం లేదు.