ఈ విషయం జరిగి చాలా రోజులైంది… ఆ రోజు ఆ విషయం జరిగినప్పుడు ఉన్న వాళ్లంతా కామ్‌గా ఉన్నారు. అంటే ఎవరికీ ఏ సమస్యా లేదని అర్థం. కానీ ఆ విషయాన్ని చూసిన వాళ్లు మాత్రం ఇంకా ఆ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటిది ‘ ఆ విషయం.. ఈ విషయం’ అంటున్నారు. ఏంటీ కన్‌ఫ్యూజ్ అనుకుంటున్నారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. అంతా సవ్యంగా సాగుతోంది, శుభం కార్డు పడింది అని అనుకుంటుండగా… బయట నుండి వినిపిస్తున్న సన్నాయి నొక్కులు టాలీవుడ్‌ని మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఇటీవల సినిమా పెద్దలు అంతా కలిశారు. చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, ఆర్. నారాయణమూర్తి, అలీ, మహి వి.రాఘవ, పోసాని కృష్ణమురళి ఇలా చాలామంది సీఎం జగన్‌ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు మాట్లాడుకున్న వీడియోలను ప్రభుత్వం తర్వాత విడుదల చేసింది. అందులో చిరంజీవి మాట్లాడుతూ ‘సీఎం జగన్ వేడుకున్నారు. పరిశ్రమకు మేలు చేయండి అంటూ చేతులు జోడించి మరీ అడిగారు’.
ఈ వీడియో బయటకు రాగానే చిరంజీవి ఇలా చేయడం ఏ మాత్రం భావ్యం కాదు అంటూ కొందరు, ఆ వీడియోను బయటకు విడుదల చేయడం సరికాదంటూ ఇంకొందరు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే అదే సమయంలో పరిశ్రమ కోసం చిరంజీవి ఓ మెట్టు దిగారు. అందులో తప్పేముంది, ఈ మాత్రం పని కూడా ఎవరూ చేయలేదు, చేయడానికి ముందుకు రాలేదు కదా అంటూ… నెటిజన్లు తిరిగి ప్రశ్నించారు. దీంతో ఇండస్ట్రీలో లేచిన కొన్ని నోళ్లు కామ్ అయ్యాయి. కానీ బయట నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయి.
సినిమా పరిశ్రమ అంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు, చిరంజీవి అంటే ప్రేమ పొంగిపోయినట్లు ఏపీలో ఓ పార్టీ ఈ మధ్య చిరంజీవిని బాగా వెనకేసుకొస్తోంది. చిరంజీవి అలా చేతులు జోడించి అడిగేలా సీఎం జగన్ చేసుకున్నారని, అది ఆయన విధానం అని విసుర్లు విసురుతోంది. దీంతో అధికార పార్టీలో మళ్లీ కోపం మొదలైందని టాక్. సినిమా పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దు అంటూనే… సినిమా వాళ్లతో సీఎం మీటింగ్‌లో జరిగిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు అనే కామెంట్లు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నాయి.
సినిమాల విషయంలో ఏపీ సీఎం చేస్తున్న అన్యాయాన్ని, ఒంటెద్దు పోకడల్ని ఆ పార్టీ ఏ రోజూ నేరుగా విమర్శించలేదు. దాని కోసం ఉద్యమాలు, నినాదాలు, నిరసనలు చేపట్టింది లేదు. అలా అని సీఎంకు సూచనలు ఇచ్చింది లేదు. మీటింగ్‌లో జరిగిన ఓ అంశాన్ని ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాడుకుంటోంది. దీంతో సినిమాలు, వాటి టికెట్ ధరల విషయంలో ప్రభుత్వానికి ఇటీవల వచ్చిన పాజిటివిటీ మళ్లీ వెనక్కి వెళ్తుందా అనే భయం కలుగుతోందని నెటిజన్లు అంటున్నారు.
పరిశ్రమ బాగు కోసం ఎవరూ ఏమీ మాట్లాడొద్దని ఆ రోజు చిరంజీవి సూచించారు. అది కేవలం పరిశ్రమ వాళ్లకే కాదు… అందరికీ అని మళ్లీ ఆయన చెప్పాలేమో. అన్నట్లు చిరంజీవి మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సినిమా ‘సైరా’కు ఎలాంటి గౌరవం ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.