దేశం గర్వించదగ్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజిఎం ఆస్పత్రి వర్గాలు ఆ విషయం పేర్కొంటూ హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఆస్పత్రికి వెళ్లిన బాలూని చూసిన కమల్ హాసన్ సిచ్యువేషన్ సీరియస్ అని బయటకొచ్చిన తరవాత మీడియాతో చెప్పారు. కుటుంబ సభ్యులు పెదవి విప్పడం లేదు. కాని కొంతమంది సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బాలూని ముందే చంపేస్తున్నారు. బాధ పడాల్సిన విషయమిది.
కొంతమంది సినీ ప్రముఖుల ఆరోగ్య విషయంలో కొన్ని సందర్భాలలో న్యూస్ ఛానళ్లు పూర్తి నిజానిజాలు తెలుసుకోకుండా… నిజమో, కాదో నిర్ధారణ చేసుకోకుండా వార్తలు ప్రసారం చేశాయి. అప్పట్లో ఆ ప్రముఖుల కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారు. మనిషిని ముందే చంపేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు బాలు విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరిస్తోంది. కాని కొందరు ప్రముఖులు ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయన ఇక లేరన్నట్టు పోస్టులు పెడుతున్నారు.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు పొందిన ఒకరు “మన అందరికీ ఇది అనివార్యమని తెలుసు. కాని బాధగా ఉంది. ఇది నిజం కాకూడదని ప్రార్ధన చేద్దాం. ఓ మై గాడ్” అని ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడినది బాలు గురించి అని భావిస్తున్నారంతా. తెలుగు, తమిళ భాషల్లో పేరున్న ఒక గాయని గురువారం సాయంత్రం గుండె పగిలిన ఎమోజీలను పోస్ట్ చేశారు. కొంతమంది RIP బాలు పోస్టులు చేశారు. తరవాత తొలగించారు. అటువంటి వ్యక్తుల వల్ల బాలు అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆందోళన వాతావరణం ఏర్పడుతోంది. సున్నితమైన ఇటువంటి అంశాల్లో అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.