పాండమిక్ సమయంలో చాలా మంది సెలబ్రిటీల రెమ్యునరేషన్లు తగ్గిపోయాయి. కరోనా వ్యవహారం ఇంకా అలానే ఉంది. థియేటర్లు తెరుచుకోలేదు. ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. దీంతో హీరోయిన్లు, దర్శకులకు మునుపటి కంటే కాస్త తగ్గించి పారితోషికాలు ఇస్తున్నారు. అయితే హీరోలు మాత్రం రెమ్యునరేషన్ లో తగ్గేదే లేదంటున్నారు. యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవల ఓ సినిమా కోసం రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇప్పుడు సీనియర్ హీరో రవితేజ రూ.17 కోట్లు అడుగుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. దీని తరువాత శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
దీంతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం రవితేజ రూ.17 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే సినిమా బడ్జెట్ మరింత పెరిగిపోతుందని నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు.