టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… తన ‘ఆహా’ ఓటీటీ ద్వారా మంచి కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య ఆయన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలు కూడా ఒకటి రెండు మాత్రమే. అందుకే పక్క భాషల్లో తనకు నచ్చిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే పని పెట్టుకున్నారు.
తన ‘గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ పై ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ సినిమాని రిలీజ్ చేశారు. అది పెద్దగా ఆడలేదు. తర్వాత రిలీజ్ చేసిన ‘కాంతార’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సాధించింది. దీంతో ఆయన ‘తోడేలు’ అనే మరో డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేశారు. అది కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘విడుదలై -1’ చిత్రాన్ని తెలుగులో ‘విడుదల -1’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
ఏప్రిల్ 15న విడుదల కాబోతున్న (Vidudhala) ఈ చిత్రానికి ఆల్రెడీ ప్రీమియర్స్ వేశారు. అటవీ నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. గిరిజనులపై పోలీసుల జులూంని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. పోలీసులు గిరిజన మహిళల పై చేసే దాడి చాలా ఘోరంగా అనిపిస్తుంది. అప్పట్లో నిజంగానే అలా జరిగుండొచ్చేమో.. కానీ ఆ సన్నివేశాలు నిజంగానే భరించలేనంత ‘రా’ గా ఉన్నాయని చెప్పాలి. థర్డ్ డిగ్రీ పేరుతో స్త్రీల బట్టలు విప్పేసి మరీ వారిని లాఠీలతో చితక్కొట్టడం వంటి సన్నివేశాలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి.
అలాగే తర్వాత వారిని రాక్షసంగా చంపేసి పారేసే సన్నివేశాలు కూడా అలాగే ఉంటాయి. మరి తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారు.. వెట్రిమారన్ కోసం టికెట్ పెడతారా? అన్నది చూడాలి. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించగా.. ప్రధాన పాత్రలో కమెడియన్ సూరి నటించాడు. దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.