పవన్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి తదితరులు (Cast)
అతుల్య రవి (Director)
చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు (Producer)
సాయి కార్తీక్ (Music)
వెంకట్ సి.దిలీప్ (Cinematography)
Release Date : ఏప్రిల్ 07, 2023
గతేడాది ఏకంగా 3 సినిమాల విడుదలతో ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా ఈ ఏడాది విడుదలైన రెండో చిత్రం “మీటర్”. రొటీన్ మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంతో తమిళ నటి అతుల్య రవి తెలుగు తెరకు పరిచయమైంది. కిరణ్ ఈ చిత్రంతో హిట్ కొట్టాడా లేదా? అనేది చూద్దాం..!!
కథ: తనకు ఇష్టం లేకపోయినా తండ్రికి ఇచ్చిన మాట కోసం పోలీస్ ఉద్యోగంలో జాయినవుతాడు అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం). ఎలాగైనా పోలీస్ ఉద్యోగం మానేద్దామని అర్జున్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి.. అర్జున్ ను హీరోను చేసేస్తాయి. దాంతో.. తనకు తెలియకుండానే హోమ్ మినిస్టర్ దగ్గర మార్కులు కొట్టేస్తాడు అర్జున్.
మరి తనకు ఇష్టం లేకుండా చేస్తున్న పోలీస్ ఉద్యోగం నుంచి అర్జున్ కళ్యాణ్ ఎలా బయటపడ్డాడు? తన తండ్రి కోరికను ఎలా తీర్చాడు? అనేది “మీటర్” (Meter) కథాంశం.
నటీనటుల పనితీరు: కిరణ్ అబ్బవరం ఇప్పటివరకూ ఎనర్జిటిక్ గా నటిస్తున్నాను అనే భ్రమలో మూసలో మగ్గిపోతున్నాడు. ఈ విషయాన్ని అతను ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది, లేదంటే త్వరగా షెడ్డుకు వెళ్ళిపోతాడు. అతుల్య రవి ఎక్స్ పోజింగ్ చేయాలా లేక నటించాలా అనే కన్ఫ్యూజన్ లోనే సగం సినిమా నెట్టుకొచ్చేసింది.
తండ్రి పాత్రలో నటించిన వంశీరాజ్ నెక్కంటి విగ్.. సినిమాలాగే చాలా అసహజంగా ఉంది. అందువల్ల ఆయన ఎంత బాగా నటించినా అది ఎలివేట్ అవ్వలేదు. ఇక మిగతా క్యాస్టింగ్ అంతా.. ఎవరెక్కువ అతి చేస్తారు అని పోటీపడి నటించినట్లుగా ఉంది.
సాంకేతిక వర్గం పనితీరు: మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పేరున్న సంస్థ ఇలాంటి సినిమా ప్రొడక్షన్ లో పాల్గొనడం అనేది నమ్మలేని విషయం. లెక్కలేనన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్యకరమైన పంచ్ డైలాగులతో నిండిపోయిన ఈ చిత్రాన్ని 2023లో థియేటర్లో విడుదల చేయడం పెద్ద జోక్. “నాదెక్కడ పెట్టుకోమంటావ్, పక్కకెళ్లి ఏం పెట్టించుకున్నావ్” లాంటి వల్గర్ పంచ్ డైలాగులు థియేటరికల్ రిలీజ్ సినిమాకి రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో దర్శకుడికే తెలియాలి.
అలాగే.. హీరోయిన్ ను మరీ బీగ్రేడ్ సినిమా తరహాలో ప్రొజెక్ట్ చేయడం, ఎంతసేపూ అమ్మాయి చెస్ట్ పార్ట్ ను ఒకటికి పదిసార్లు జూమ్ చేసి క్లోజప్ లో ఎలివేట్ చేయడం అనేది దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ పైత్యానికి పరాకాష్టగా నిలిచింది. తెలుగులో ఇదివరకూ ఈ తరహా డబుల్ మీనింగ్ డైలాగులు, లేదా హీరోయిన్ క్లోజప్ షాట్స్ తో సినిమాలు రాలేదని కాదు, కానీ “మీటర్” ఇంకాస్త జుగుప్సాకరంగా తెరకెక్కించారు. అందువల్ల.. సగటు సినిమా ప్రేక్షకుడు థియేటర్లో ఈ చిత్రాన్ని పూర్తిగా చూడడం కాస్త కష్టమే.
విశ్లేషణ: “మీటర్” కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనూ వీలైనంత త్వరగా చెరిగిపోవాల్సిన చిత్రం. కిరణ్ అబ్బవరం కాస్త దూకుడు తగ్గించి.. తదుపరి సినిమాల విషయంలోనైనా కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకొని, నటుడిగా కాసింత వేరియేషన్ చూపించకపోతే.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్లుగా.. మిగతా ఫ్లాప్ హీరోల జాబితాలో కిరణ్ చేరిపోవడం ఖాయం.