టాలీవుడ్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ స్టైలే వేరు. సినిమాల్లో హీరోయిన్ కావొచ్చు కానీ… నిజ జీవితంలో హీరోలా ఉంటుంది. ఆమె గురించి, ఆమె ప్రాజెక్టుల గురించి ఎవరైనా మాట్లాడితే కాస్త కఠువుగానే సమాధానం చెబుతుంటుంది. గతంలో ఆమె కొన్ని విషయాల్లో లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా మరోసారి అదే పని చేసింది. ఈసారి టాపిక్ ‘వయెలెన్స్’. ‘సలార్’ సినిమాతో ఈ ఏడాది మూడో విజయం అందుకుంది.
‘సలార్’ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడింది శ్రుతి హాసన్. ఈ సందర్భంగా ‘సలార్: సీజ్ ఫైర్’ సినిమా గురించి ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. అయితే సినిమాల్లో హింసాత్మక ధోరణులు ఎక్కువవుతున్నాయి అంటూ ఓ ప్రశ్న వచ్చింది. దానికి స్పందిస్తూ శ్రుతి హాసన్ కాస్త కఠువుగానే సమాధానం చెప్పింది. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రుతి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా ఎలా ఉంటుందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దాని బట్టి ఆ సినిమా చూడాలో వద్దా ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. అయినా సినిమాలే హింసను ప్రేరేపిస్తున్నాయి అనడం సరికాదు. సినిమాలు, పాటలు, టీవీ షోలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అలా అని అన్నీ హింసాత్మకంగా ఉండవు. కొన్ని ఈ జోనర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా ఆకట్టుకుంటాయి కదా అని తిరిగి ప్రశ్నించింది. అంతేకాదు ఏ సినిమా చూడాలి, ఏ షో చూడాలి అనేది ప్రేక్షకులు ఎంపిక చేసుకోవచ్చు.
అందరూ ఒకేరకమైన సినిమాలను ఇష్టపడరు కదా. కొందరు యాక్షన్ సినిమాలను ఇష్టపడితే. మరికొందరికి డ్రామా సినిమాలు నచ్చుతాయి. అలా ఎవరికి నచ్చినవి వాళ్లు చూస్తారు అని శ్రుతి హాసన్ చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలోనే బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో నటించి రెండు విజయాలను సొంతం చేసుకుంది (Shruti Haasan) శ్రుతి హాసన్. ఇప్పుడు ‘సలార్’ కూడా విజయం సాధించింది. మధ్యలో స్పెషల్ సాంగ్ చేసిన ‘హాయ్ నాన్న’ కూడా హిట్టే.