2025 బాక్సాఫీస్ ప్రయాణం దాదాపు చివరి మలుపుకు వచ్చేసింది. ఈ ఏడాది ట్రేడ్ పండితులు కొత్తగా ఒక బెంచ్‌మార్క్ ఫిక్స్ చేశారు, అదే “డే 1 వంద కోట్ల క్లబ్”. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా, రిలీజ్‌కు ముందున్న హైప్‌తోనే తొలిరోజు 100 కోట్లు కొల్లగొట్టడం అనేది ఇప్పుడు హీరోల స్టామినాకు అసలైన టెస్టుగా మారింది. ఈ ఏడాది మొత్తం మీద, ఇండియా వైడ్ ఆ అరుదైన ఫీట్‌ను అందుకున్నవి కేవలం రెండే రెండు సినిమాలు.
Akhanda 2
అందులో మొదటిది, రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ‘కూలీ’. సినిమా తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా, ఆ ఇద్దరి క్రేజ్ దానికి 100 కోట్లకు పైగా ఓపెనింగ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. సుజీత్ టేకింగ్‌కు, పవన్ మానియా తోడవ్వడంతో ఈ సినిమా కూడా తొలిరోజే 100 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది.
ఇప్పుడు 2025 ముగింపులో, ఇండస్ట్రీ మొత్తం చూపు డిసెంబర్ 5న రాబోతున్న ఒకే ఒక్క సినిమాపై పడింది. అదే ‘అఖండ 2’. ‘అఖండ’ లాంటి ఇండస్ట్రీ హిట్‌కు సీక్వెల్‌గా, బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో వస్తుండటంతో అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు ప్రశ్న సినిమా హిట్టా ఫ్లాపా అని కాదు, ఈ సినిమా ‘కూలీ’, ‘ఓజీ’ సరసన నిలిచి, ఆ 100 కోట్ల ఓపెనింగ్ క్లబ్‌లో మూడో సినిమాగా నిలవగలదా? అనేది అసలు పాయింట్. ఇది బాలయ్య కెరీర్‌లోనే కాదు, బోయపాటి కెరీర్‌కు కూడా అతిపెద్ద అగ్నిపరీక్ష కానుంది.
‘అఖండ 2’కు ఉన్న పాజిటివ్ వైబ్స్ వేరు. బాలయ్య ‘అఘోరా’ గెటప్‌కు, ముఖ్యంగా హిందీ డబ్బింగ్ ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తోడు బోయపాటి మార్క్ ‘పూనకాలు’ తెప్పించే ఎలివేషన్స్, థమన్ బీజీఎం.. ఈ కాంబోపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఇక ట్రైలర్ గనుక ‘అఖండ 1’కి మించి హై రేంజ్ లో ఉంటే, ఆ అఘోరా దెబ్బకు ఈ రికార్డును కొట్టడం అసాధ్యమేమీ కాకపోవచ్చు.
అయితే ‘అఖండ’ మొదటి భాగం తెలుగులో ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఆడినా, దాని ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్ 100 కోట్ల మార్కును అందుకోలేదు. ఇప్పుడు సీక్వెల్, మొదటి భాగం కంటే దాదాపు 5 రెట్లు పెద్ద ఓపెనింగ్ తెస్తేనే ఈ ఫీట్ సాధ్యమవుతుంది. అంటే, తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ మార్కెట్లలో కూడా ఒకేసారి భారీ ఓపెనింగ్ రావాలి.