ఒక నటుడిగా, దర్శకుడిగా కంటే వ్యక్తిగా ఉన్నతమైన భావాలు కలిగిన సున్నిత మనస్కుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). అతడి దర్శకత్వంలో తెరకెక్కిన “చిలసౌ” చాలామందికి మోస్ట్ ఫేవరేట్ సినిమా. ఆ తర్వాత “మన్మథుడు 2”తో ఫ్లాప్ చవిచూసి కొన్నాళ్లపాటు మెగాఫోన్ కి దూరంగా ఉన్నాడు. కొంత విరామం అనంతరం రాహుల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్”. రష్మిక (Rashmika) డేట్స్ కారణంగా పలుమార్లు షూటింగ్ డిలే అయ్యి, ఆ తర్వాత సరైన రిలీజ్ డేట్ కోసం నిర్మాత ధీరజ్ వెయిట్ చేస్తూ ఎట్టకేలకు నేడు (నవంబర్ 07) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు “గర్ల్ ఫ్రెండ్” (The Girlfriend) చిత్రాన్ని. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఏమేరకు ఓన్ చేసుకున్నారు?, రాహుల్ చెప్పాలనుకున్న అంశాన్ని అర్థం చేసుకున్నారు? అనేది చూద్దాం..!!

కథ: భూమాదేవి (రష్మిక) ఆత్మస్థైర్యం ఉన్నప్పటికీ తండ్రి చాటున పెరిగిన సగటు ఆడపిల్ల. కాలేజ్ లో పరిచయమైన విక్రమ్ (దీక్షిత్ శెట్టి)ని ప్రేమిస్తున్నానో లేదో తెలియని అయోమయంలో అభిమానిస్తూ.. అతడి బాహువు కింద స్వేచ్చను, ఆనందాన్ని వెతుక్కుంటూ, మధ్యమధ్యలో చదువుతూ గడిపేస్తుంటుంది.
అయితే.. తాను ప్రేమ అనుకుంటున్నది ఓ చెర అని, తనకు తెలియకుండా తాను కుచించుకుపోతున్నానని గ్రహించి.. ఆ చట్రం నుండి బయటపడాలి అనుకుంటుంది.
ఆ క్రమంలో భూమ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వాటిని తట్టుకుని ఎలా నిలబడింది? అనేది “ది గర్ల్ ఫ్రెండ్” కథాంశం.

నటీనటుల పనితీరు: మరీ సరికొత్త రష్మిక (Rashmika), రష్మిక విశ్వరూపం లాంటి పదాలు వాడలేం కానీ.. ఒక సగటు అమ్మాయికి, అది కూడా తండ్రి చాటు బిడ్డగా పెరిగిన పిల్లకి ఉండే భయాల్ని ఒద్దికగా పండించింది రష్మిక. రోహిణిలో తనను తాను చూసుకునే సందర్భంలో ఆమె ముఖంలో కనిపించిన భయాందోళనను ప్రేక్షకులు కూడా అనుభూతి చెందుతారు. అలాగే.. క్లైమాక్స్ లో ఆమె కోపాన్ని, తెగింపును కూడా స్వాగతిస్తారు. నటిగా రష్మిక మరో మెట్టు ఎక్కే చిత్రమిది.
దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) పోషించిన పాత్ర నెగిటివ్ అయినప్పటికీ.. అది చెడు కాదు, వారసత్వంగా పెంపకం నుండి అలవడిన వ్యక్తిత్వం. అధికార మదం లాంటి మేకపోతు గాంభీర్యాన్ని అద్భుతంగా పండించాడు దీక్షిత్. మగాడ్ని కాబట్టి నేనే గొప్ప అనే బలుపు అతడి మ్యానరిజమ్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో, ఆఖరికి ఎగశ్వాస తీసుకొని విధానంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇందులో ఇలాంటి నెగిటివ్ రోల్ చేశాడు కాబట్టి అతడికి అన్నీ నెగిటివ్ రోల్స్ కట్టబెట్టకుండా.. డిఫరెంట్ రోల్స్ ఇస్తే గనుక నటుడిగా మంచి స్థాయికి ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు దీక్షిత్.
అను ఇమ్మాన్యుల్ నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది కానీ.. ఆమెకు విక్రమ్ వ్యవహారశైలి ఎప్పుడు అర్థమైంది? అనే విషయాన్ని చూపించకపోవడంతో ఆమె పాత్ర సంతృప్తినివ్వలేకపోయింది.
రావు రమేష్, రోహిణి సన్నివేశాలు తక్కువే అయినప్పటికీ.. వారి సీనియారిటీతో సదరు పాత్రలకు న్యాయం చేశారు.
ఫ్రెండ్స్ క్యాస్టింగ్ విషయంలో తెలిసిన మొహాలు తక్కువగా ఉండడంతో.. ఏ ఒక్కరి పాత్ర కూడా రొటీన్ గా అనిపించలేదు.

సాంకేతికవర్గం పనితీరు: హేషమ్ పాటల్ని ప్రశాంత్ ఆర్.విహారి బ్యాగ్రౌండ్ స్కోర్ డామినేట్ చేసింది. పాత్ర తాలూకు భావాన్ని, సన్నివేశంలోని ఎమోషన్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాడు.
సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ… కలరింగ్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాలోని మూడ్ కి తగ్గట్లు బ్రైట్ నుండి డల్ అయితే బాగుండేది. అలా కాకుండా సినిమా మొత్తం డల్ గానే ఉండడం అనేది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను కాస్త ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆర్ట్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ టీమ్స్ మినిమల్ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ వచ్చేందుకు తోడ్పడ్డారు.
ఇక దర్శకుడు, కథకుడు, రచయిత రాహుల్ రవీంద్రన్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. మహిళా సాధికారత అనే అంశాన్ని ఏదో క్లాస్ పీకినట్లుగా కాకుండా, మెటాఫరికల్ చెప్పిన విధానం బాగుంది. హీరోయిన్ తనలో తానే కుచించుకుపోతుంది అనే భావన ప్రేక్షకులు కూడా అనుభవించేలా ఆమెను కడుపులో ఉన్న బిడ్డ మాదిరి ముడుచుకుపోయినట్లుగా చూపిన విధానం, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆమె అయోమయంలో నలిగిపోతుంది అనే భావన కలిగించేలా సీక్వెన్స్ ను డిజైన్ చేసిన విధానం కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా హాస్టల్ డోర్ మీద పెయింట్ సీక్వెన్స్ కు ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుంది. అయితే.. ఆలోచన బాగున్నప్పటికీ, సదరు సన్నివేశాల కంపోజిషన్ & ఎగ్జిక్యూషన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అందువల్ల.. రచయితగా రాహుల్ కచ్చితంగా ఆకట్టుకుంటాడు కానీ.. దర్శకుడిగా మాత్రం పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడు.

విశ్లేషణ: వెలుగు విలువ తెలియాలంటే చీకటిలోని అంధకారాన్ని చూపించాల్సిందే. అలాగే.. ఒక పాత్ర మంచిది అని చెప్పాలంటే, అపోజిట్ పాత్ర చెడ్డది అని చూపించాల్సిందే. అయితే.. చీకటి పొరల్లోనూ ఓ చిన్ని వెలుతురు ఉంటుంది. ఆ పొరల్లో నుండి మెల్లగా వెలుగును అనుభూతి చెందినప్పుడే.. ఒక సంపూర్ణ భావన కలుగుతుంది. “గర్ల్ ఫ్రెండ్” (The Girlfriend) ఆ సంపూర్ణతకు ఇసుమంత దూరంలో ఆగిపోయింది.
అయితే.. ఆడపిల్ల మనసును అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఓ ఆడపిల్లకి ఇచ్చే గౌరవం ఏంటి, ఇవ్వాల్సిన హోదా ఏమిటి? వంటి విషయాలను నిర్లిప్తింగా రాహుల్ రవీంద్రన్ సినిమాలో చెప్పిన విధానం బాగుంది. సినిమాలోని జస్టిఫికేషన్ తో, ముఖ్యంగా క్లైమాక్స్ లో రష్మిక ఇచ్చే స్పీచ్ తో అందరూ ఏకీభవించకపోవచ్చు కానీ.. కచ్చితంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనను రేకెత్తించగలిగాడు కాబట్టి రాహుల్ సక్సెస్ అయినట్లే. ఈ ఆలోచన రేపన్న రోజున చర్చగా మారితే సినిమా కూడా విజయం సాధించినట్లే.

ఫోకస్ పాయింట్: ప్రతి మగాడు స్వీయ విమర్శ చేసుకోవాలనిపించేలా చేసిన గర్ల్ ఫ్రెండ్!
రేటింగ్: 3/5
