బుల్లితెరపై సంచలనం సృష్టించిన “మొగలిరేకులు” అనే సీరియల్ ద్వారా నటుడిగా పరిచయమైన సాగర్ ఆ సీరియల్ తో విపరీతమైన క్రేజ్ ను, ఫాలోయింగ్ ను సంపాదించుకొన్నాడు. ఆ క్రేజ్ తోనే వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకొని తొలి ప్రయత్నంలో “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అనే చిత్రంతో పరిచయమై బోల్తాకొట్టాడు. అయితే.. వెండితెరపై హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్న ధృడ నిశ్చయంతో రెండో ప్రయత్నంగా నటించిన చిత్రం “సిద్దార్థ”.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అనుంగా శిష్యుడైన దయానంద్ “అలియాస్ జానకి” అనంతరం తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది? హీరోగా సాగర్ తన రెండో ప్రయత్నంలోనైనా విజయాన్ని అందుకోగలిగాడా? వంటి విషయాలు మా రివ్యూ చదివి తెలుసుకోండి..!!
కథ : సిద్దార్థ అలియాస్ సూర్య ప్రతాప్ (సాగర్) ఇండియాలో తన తండ్రిని చంపిన వ్యక్తిని మీగ ప్రతీకారం తీర్చుకొని.. తల్లి మాట మేరకు మలేసియా వెళ్ళిపోతాడు. ఆ జర్నీలో పరిచయమైన సహస్ర (రాగిణి నంద్వాని)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. త్వరితగతిన వీరి మధ్య ప్రేమ పరవళ్ళు తొక్కడం అందుకు ప్రతీకగా హీరోయిన్ ప్రగ్నంట్ అవ్వడం జరిగిపోతాయి.కట్ చేస్తే.. విక్రమ్ (అజయ్), సూర్య (సాగర్) కుటుంబాల మధ్య గొడవలు సమసిపోవాలంటే విక్రమ్ చెల్లెలు అప్సరను (సాక్షి చౌదరి) పెళ్లాడాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయిస్తారు. అప్పటికే కారణాంతరాల వలన సహస్ర తన నుండి విడిపోవడంతో సూర్య పెళ్ళికి ఒప్పుకొంటాడు. అప్పడే సూర్య ప్రేమను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న సహస్ర ఈవెంట్ మేనేజర్ గా సరికొత్త కెరీర్ ను ప్రారంభించి అనుకోకుండా సూర్య పెళ్లి పనులకే వస్తుంది.సహస్ర స్వహస్తాలతో అప్సరతో సూర్య వివాహం దగ్గరుండి చేయించిందా? సూర్య అలియాస్ సిద్దార్థ ప్రేమ-పగలలో దేన్ని తన జీవితాసంగా ఎంచుకొన్నాడు? అనేది “సిద్దార్థ” కథాంశం.
నటీనటుల పనితీరు : “మొగలిరేకులు” సీరియల్ లో డబుల్ రోల్ లో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్న సాగర్ “సిద్దార్థ” చిత్రంలో మరి దర్శకుడు అలా చేయమని చెప్పాడో లేక “ఖడ్గం” చిత్రంలో శ్రీకాంత్ ను చూసి ఇన్స్ ఫైర్ అయ్యాడో తెలియదుకానీ.. సినిమా మొత్తం పాటల్లో మినహా మరెక్కడా నవ్వుతూ కనిపించడు. మరి అలా సీరియస్ గా ఉంటూ ఎటువంటి ఎమోషన్స్ ను ఎలివేట్ చేయాలనుకొన్నాడో సాగర్ కే తెలియాలి.ఇక హీరోయిన్లు రాగిణి, సాక్షి చౌదరీలు గ్లామర్ ను అద్దడానికి తప్పితే ఎందుకూ ఉపయోగపడలేదు. ఇక వారి నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.కోట శ్రీనివాసరావు, సన, అజయ్, నాగినీడు, సుబ్బరాజు వంటి సీజన్డ్ ఆర్టిస్టుల్ని కూడా కేవలం స్క్రీన్ ను ఫిల్ చేయడం కోసమే వాడడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం.
సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ తన బ్రాగ్రౌండ్ స్కోర్ తో సినిమాలో కాస్త ఇంటెన్సిటీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కథలో విషయం లేకపోవడంతో ఆయన ప్రయాసంతా వృధా అయ్యింది.సీనియర్ కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి తన ప్రతిభతో కౌలాలంపూర్ అందాలను, హీరోయిన్ గ్లామర్ ను స్క్రీన్ పై ప్రెజంట్ చేయడానికి చేసిన విశ్వప్రయత్నం నీరుగారింది.ఫైట్ సీన్స్ లో ఇంటెన్సిటీ లేదు, విస్సు సమకూర్చిన కథలో విషయం లేదు, గ్రాఫిక్ వర్క్ లో పసలేదు.”అలియాస్ జానకితో” 2013లో దర్శకుడిగా మారిన దయానంద్ ఆ తర్వాత మళ్ళీ మూడేళ్ళ విరామం అనంతరం దర్శకత్వం వహించిన “సిద్దార్థ” చిత్రం చూస్తే.. దర్శకుడిగా అతడిలో ఇసుమంతైనా మార్పు కనపడదు. అవకాశాల్లేక చాలామంది ఇబ్బందిపడుతుంటే.. వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోకుండా దయానంద్ లాంటి దర్శకులు తెలుగు సినిమా స్థాయిని నానాటికీ దిగజారుస్తున్నారు.ఓవరాల్ గా.. పూర్తి స్థాయి దర్శకుడి ఫెయిల్యూర్ గా “సిద్దార్థ” చిత్రాన్ని పేర్కొనవచ్చు!
విశ్లేషణ : “మొగలిరేకులు” సీరియల్ కు ఎక్స్ టెండెడ్ వెర్షన్ లాంటి “సిద్దార్థ”ను సాగర్ కు వీరాభిమానులైన బుల్లితెర వీక్షకులు కాస్త ఓపికగా చూడవచ్చు!