‘డిజె’(DJ Tillu) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమాలతో హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) రేంజ్ పెరిగింది. ‘టిల్లు స్క్వేర్’ అయితే వంద కోట్ల పైగా వసూళ్లు సాధించింది. దీంతో సిద్ధు తన పారితోషికాన్ని కూడా పెంచేశాడు. ఇందుకు నిర్మాతలు కూడా ఏమీ అభ్యంతరం తెలుపలేదు. అతను పెంచిన పారితోషికం ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కాకపోతే ‘జాక్’ (Jack) ఫలితం అతనికి పెద్ద షాకిచ్చింది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో నిర్మాత, హీరో తప్ప ఎవ్వరూ బాధపడటం లేదు.
ఎందుకంటే.. ‘జాక్’ సినిమా విషయంలో సిద్ధు కెలుకుడు ఎక్కువైపోయింది అని యూనిట్ సభ్యులు పరోక్షంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే దర్శకుడు భాస్కర్ (Bhaskar) ‘నీ పని నువ్వు చేస్కో చాలు’ అన్నట్టు పరోక్షంగా సిద్ధుపై సెటైర్ విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘జాక్’ ఫలితానికి పూర్తి బాధ్యత సిద్ధుదే అని చెప్పడంలో సందేహం లేదు అనేది ఇండస్ట్రీ మాట. సరే హిట్స్, ప్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ ఆ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ ఇంకో సినిమాపై పడటం అనేది పెద్ద సమస్య.
ఇప్పుడు సిద్ధుకి అలాంటి సమస్యే వచ్చి పడింది. అతను ఓ రూ.100 కోట్ల సినిమా ఆఫర్ పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పరశురామ్(బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో సిద్ధు ఒక సినిమా చేయాలి. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాలి అనేది దిల్ రాజు ఆలోచన. సిద్ధు కూడా ఈ సినిమా కోసం రూ.15 కోట్లు పారితోషికం డిమాండ్ చేశాడట.
అయితే ‘జాక్’ ఫలితం తేడా కొట్టడంతో సిద్ధుని పక్కన పెట్టాలని పరశురామ్, దిల్ రాజు డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకు పారితోషికం ఒక్కటే కారణం కాదు అని అంటున్నారు. ‘జాక్’ సినిమా విషయంలో సిద్ధు ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి బొమ్మరిల్లు భాస్కర్, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad)..లు వివరించడంతో… దిల్ రాజు వెనక్కి తగ్గినట్టు స్పష్టమవుతుంది.