Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!
- October 2, 2026 / 06:54 PM ISTByFilmy Focus Desk
Cast & Crew
- సందీప్ కిషన్ (Hero)
- ఫరియా అబ్దుల్లా (Heroine)
- సంపత్ రాజ్, రాజు సుందరం, శివ్ పండిట్, మగా లక్ష్మీ, షీలా రాజ్ కుమార్ తదితరులు (Cast)
- జేసన్ సంజయ్ (Director)
- సుభాస్కరన్ (Producer)
- తమన్ (Music)
- కృష్ణన్ వసంత్ (Cinematography)
- ప్రవీణ్ కె ఎల్ (Editor)
- Release Date : 2rd జూలై 2026
- లైకా ప్రొడక్షన్స్ (Banner)
తమిళనాడు ముఖ్యమంత్రి…అగ్ర హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ “సిగ్మా” (Sigma) మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా కనిపించింది. దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్ కారణంగా సిగ్మా మూవీపై ఆరంభం నుంచే కోలీవుడ్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి లాంటి స్టార్ హీరో ప్రమోషన్స్‌లో పాల్గొనడంలో తెలుగులోనూ ఈ సినిమాపై మోస్తారు బజ్ ఏర్పడింది. శుక్రవారం తెలుగుతో పాటు తమిళంలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? డెబ్యూ మూవీతో జాసన్ సంజయ్ దర్శకుడిగా హిట్టు అందుకున్నాడా? లేదా? అంటే?
Sigma Movie Review

కథ: గురు (Sundeep Kishan) ఓ అనాథ. అప్పుల బాధతో తండ్రి…మనోవేదనతో తల్లి కన్నుమూస్తారు. తాకట్టులో ఉన్న ఆస్తులన్నింటినీ కోల్పోగా, చిట్టచివరికి మిగిలిన ఒకేఒక లైబ్రరీ అతనికి నివాసంగా మారుతుంది. అయితే, ఆ లైబ్రరీని కొట్టేయాలని అప్పులవాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌గా ఉంటూ వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు గురు. ఆర్జే సామ్ (Faria Abdullah) అతనికి పరిచయమవుతుంది. ఆమె సాయంతో గురు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ను పెంచుకుంటాడు.
అప్పుల భారం పెరిగిపోవడంతో . అడ్డదారిలో బెట్టింగ్ వ్యవహారాల్లోకి అడుగుపెడతాడు. అక్కడ తనవద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకోవడమే కాకుండా, ఒక డ్రగ్ మాఫియాతో గొడవకు దిగుతాడు. ఈ గొడవ కారణంగా రెడ్డి (సంపత్ రాజ్), విన్సెంట్ (శివ్ పండిట్) వంటి కరుడుగట్టిన డాన్‌లకు టార్గెట్ అవుతాడు. ఆ తర్వాత గురు జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగింది? అడ్డంకులను దాటుకొని అతడు ఏ విధంగా కోటీశ్వరుడిగా ఎదిగాడు? అనేదే మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: సందీప్ కిషన్ ప్రతి సినిమాలో మాదిరే ఈ సినిమాలో కూడా హ్యాండ్సమ్ గా కనిపించాడు. హుషారుగా నటించాడు. కానీ ఎలివేషన్ సీన్స్ అతనికంటే ఎక్కువగా సంపత్ రాజ్ కే పడ్డాయి. ఫరియా అబ్దుల్లా బాగానే చేసింది కానీ ఆమె క్యారెక్టర్ కి సరైన ఆర్క్ లేదు. రాజు సుందరం పాత్ర కూడా ఫోర్స్డ్ గా పెట్టినట్టు ఉంది. శివ్ పండిట్ టాలెంట్ ను కూడా దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు.

సాంకేతిక వర్గం పనితీరు: తండ్రి దళపతి విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్..ఫ్యాన్ బేస్ సపోర్ట్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ సినిమాలు చేసుకునే అవకాశం జాసన్ సంజయ్‌కి ఉంది.కానీ దర్శకుడిగా మొదట తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాడు. అతడి ఆలోచన అభినందించదగినదే. కానీ దర్శకుడిగా వేసిన తొలి అడుగు విషయంలో తడబడ్డాడు తన ముద్ర వేసుకోలేకపోయాడు. మొదటి 15 నిమిషాల తర్వాత సినిమా కథనంలో వేగం తగ్గిపోతుంది. ఒక్కటే సన్నివేశం రిపీటెడ్ గా వస్తుంటుంది. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంటుంది. తమన్ సంగీతంలో వచ్చే పాటలు అన్నీ పాత ఫ్లేవర్లోనే ఉంటాయి. పాటల సంగతి ఎలా ఉన్నా నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచుతాడు తమన్. ఈ సినిమాలో అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజిక్ కూడా మిస్ అయ్యింది. లైకా వారు సందీప్ కిషన్ కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారు. క్వాలిటీ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది.

విశ్లేషణ: గ్యాంబ్లింగ్, డ్రగ్స్, బ్లాక్ మనీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హీరోయిజం, యాక్షన్ అంశాలతో ఈ కథలను డిఫరెంట్‌గా చెప్పి డైరెక్టర్లు విజయాలను అందుకున్నారు. అయితే సిగ్మా విషయంలో జేసన్ అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. సినిమా స్టార్ట్ అయిన మొదటి అరగంటకే కథ మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత ముందుకు సాగక అక్కడే తిరుగుతూ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ కూడా కథ , కథనాలకు సింక్ అవ్వలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ హెవీ అయ్యాయి. కొన్ని చోట్ల వయోలెన్స్ కూడా శృతిమించింది. ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ కి వెళ్ళిపోయి తర్వాత నచ్చిన సీన్లు తీసుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది సిగ్మా. క్లైమాక్స్ ని ఇంతలా సాగదీసిన సినిమా ఈ మధ్య కాలంలో మరోటి రాలేదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

ఫోకస్ పాయింట్: టైటిల్ లో క్లారిటీ లేదు. కథ, కథనాల్లో కొత్తదనం లేదు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారిని సైతం సిగ్మా ఆకట్టుకోవడం కష్టం
రేటింగ్: 1.5/5
Click Here To Read In ENGLISH


















