సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. వరుసగా ఆశించిన ఫలితాలు రాకపోవడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసిన కొన్ని సవాళ్లు తేడా కొట్టడంతో నెటిజన్లు ఆయన్ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. అయితే ఈ విమర్శలను నిర్మాత ఏమాత్రం ఇగోకి తీసుకోలేదు. “గత రెండు మూడు నెలలుగా నన్ను బాగానే ఏసుకున్నారు” అంటూ ఆ ట్రోల్స్ ను స్పోర్టివ్ గా స్వీకరించి, ఇప్పుడు అసలు సిసలైన కమ్ బ్యాక్ ప్లాన్ తో ముందుకొచ్చారు.
Sithara Entertainments
ఇకపై నెటిజన్లకు ఒక్క సెటైర్ వేసే ఛాన్స్ కూడా ఇవ్వకూడదని నాగవంశీ కసిగా ఉన్నారు. అందుకే 2026 ప్రథమార్ధంలో తన బ్యానర్ నుంచి ప్రతీ నెలా ఒక సినిమాను దించడానికి సిద్ధమయ్యారు. గతంలో రిలీజ్ డేట్ల కోసం హడావిడి పడి చేతులు కాల్చుకున్న అనుభవం ఉంది కాబట్టి, ఈసారి కేవలం కంటెంట్ మీద నమ్మకం కుదిరాకే థియేటర్లలోకి వస్తామని మాటిచ్చారు. అవుట్ పుట్ విషయంలో పూర్తి సంతృప్తి చెందాకే రిలీజ్ డేట్ ప్రకటిస్తారట.
ప్రస్తుతం నాగవంశీ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ ‘కోహినూర్’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, అఖిల్ ‘లెనిన్’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’, అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’.. ఇలా యువ హీరోలందరినీ లైన్లో పెట్టారు. ఈ సినిమాలన్నీ దాదాపు షూటింగ్ దశలో ఉన్నాయి. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ వరకు బాక్సాఫీస్ దగ్గర సితార బ్యానర్ లోగో రెగ్యులర్ గా కనిపించడం ఖాయం.
విమర్శకులకు మాటలతో కాకుండా సినిమాలతోనే సమాధానం చెప్పాలనేది నిర్మాత ప్లాన్. చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే కాబట్టి, అవి బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయితే నాగవంశీ మళ్ళీ టాప్ గేర్ లోకి వచ్చేస్తారు. తనపై వచ్చిన నెగటివిటీని పాజిటివ్ గా మార్చుకుని, వరుస విజయాలతో 2026ను తన నామ సంవత్సరంగా మార్చుకుంటారో లేదో చూడాలి.
