టాలీవుడ్‌లో యాక్టర్ కపుల్ శివబాలాజీ, మధుమిత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కొన్ని సినిమాలు చేశాక.. సరైన విజయం దక్కక ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. శివబాలాజీ బిగ్‌బాస్‌తో చాలామందికి సురపరిచితులు అయ్యారు. వారిద్దరికి ప్రేమ వివాహం అనే విషయం మనకు తెలిసిన విషయమే. అయితే వాళ్ల జీవితంలో పెళ్లికి ముందే బ్రేకప్ ఉందని మీకు తెలుసా? ఇటీవల ఓ టీవీ షోలో శివబాలాజీ – మధుమిత తమ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆ బ్రేకప్ కహానీ ఏంటో వాళ్ల మాటల్లోనే చూద్దాం!
‘‘మా ఇద్దరికి బ్రేకప్ అనలేం. ఎందుకంటే మా ఇద్దరి జాతకాలు కలవలేదని బాలాజీ ఇంట్లోవాళ్లు చెప్పారు. మేం పెళ్లి చేసుకుంటే బాలాజీ వాళ్ల అమ్మకు ఆయుక్షీణమని జాతకాల్లో ఉందట. అయితే నేను జాతకాలను నమ్మను. కానీ వాళ్లింట్లో నమ్ముతారు. అంతకముందే మేమిద్దరం ఒకటనుకున్నాం. ఇరువురి ఇంట్లో ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. తీరా జాతకాల కారణంగా మా బ్రేకప్ జరిగింది’’ అని మధుమిత చెప్పుకొచ్చింది.
ఇదే విషయంలో శివబాలాజీ కూడా మాట్లాడాడు. ‘‘అదొక దురదృష్టకరమైన అంశం. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. నాపై తనకు ఇష్టం కలిగేలా నేనే ప్రవర్తించి, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి, చివరకు జాతకాలు కలవట్లేదని చెప్పానే అనిపించింది. కానీ ఏం చెయ్యను? పరిస్థితుల ప్రభావం అలా ఉంది. మా బ్రేకప్ అయ్యాక ఒక సంవత్సరం గడువు విధించుకున్నాను. ఈ లోపు తనకు గానీ, నాకుగానీ వేరే పెళ్లైతే వదిలేద్దాం అని అనుకున్నాను. లేదంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంకల్ప బలం అంటారు కదా… అదే పనిచేసిందేమో. ఒక సంవత్సరం తర్వాత జాతకాలు చూపిస్తే మళ్లీ కలిశాయి. వెంటనే తన మెడలో మూడు ముళ్లు వేసేశా’’ అంటూ ఆనందంతో చెప్పాడు శివబాలాజీ.