రీసెంట్ గా విడుదలైన విజయ్ ‘బీస్ట్’ సినిమా నుంచి ‘అరబిక్ కుతు’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట విన్న విజయ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. చాలా కాలం తరువాత విజయ్ స్టైలిష్ స్టెప్స్ వేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్, స్టైలిష్ కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ మాత్రమే కాకుండా.. పాట రాసిన హీరో శివ కార్తికేయన్ కు కూడా క్రెడిట్ ఇవ్వాలంటున్నారు విజయ్ ఫ్యాన్స్.
టీవీలో షోలు, సీరియల్స్ లో కనిపించే శివ కార్తికేయన్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. అతడికి కోలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. హీరోగా, ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆయన గేయ రచయితగా కూడా తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. గతంలో కొలమావు కోకిల కోసం యోగిబాబు ‘కళ్యాణ వయసు’ సాంగ్, డాక్టర్ కోసం ‘చెల్లమ్మ’, ‘సో బేబీ’, సూర్య సినిమాలో ‘సుమ్మ సుర్రును’ లాంటి హిట్ సాంగ్స్ రాశారు.
ఇప్పుడు ‘బీస్ట్’ సినిమాలో అరబిక్ కుతు పాటతో అలరిస్తున్నారు. చాలా తక్కువ సమయంలో ఈ పాటను రాశారు శివ కార్తికేయన్. దీనికోసం ఆయన పెద్దగా కష్టపడలేదట. అరబిక్ హమ్మింగ్ పదాలను సేకరించి.. వాటికి తమిళ పదాలు మేళవించి రాశానని చెప్పారు. అలా అరబిక్ కుతు సాంగ్ రాయడం ఈజీ అయిందని అన్నారు. అయితే ఈ పాట ద్వారా వచ్చిన పారితోషికాన్ని సినీ గేయ రచయిత, దివంగత ముత్తుకుమార్ కుటుంబానికి అందించారు.
కోలీవుడ్ లో ఎన్నో పాటలు రాసిన ముత్తుకుమారు 2016లో జాండిస్ తో మరణించారు. ఆయన శివ కార్తికేయన్ సినిమాలకు కూడా పాటలు రాశారు. ఆ కృతజ్ఞత భావంతో ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంటారు శివ కార్తికేయన్. ఇదివరకు కూడా ఇలానే ఆర్థిక సాయం అందించారు.