Skanda Trailer: ‘స్కంద’ ట్రైలర్‌ రివ్యూ… బోయపాటి పూనకంలో రామ్‌ విలయతాండవం!

బోయపాటి శ్రీను సినిమాల్లో ఒక మత్తు ఉంటుంది. మాస్‌ జనాలు ఆ మత్తు తాకితే హుషారెక్కిపోతారు. ఇక రామ్‌ పోతినేని నటనలో ఒక యాటిట్యూడ్‌ ఉంటుంది. ఆ ఫీల్‌ను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. మరి ఈ ఇద్దరూ కలిస్తే.. ఆ కాంబో గురించి చెప్పడానికి మాటలు చాలవు. ‘ఐ యామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ దిస్‌ కాంబో’ అనాల్సిందే. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి ‘స్కంద’ అంటూ బాక్సాఫీస్‌ దగ్గరకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న వేళ చిత్రబృందం ట్రైలర్‌ విడుదల చేసింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం.

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుననారు. ఈ సినిమాను సెప్టెంబరు 15న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ థండర్ అదేనండీ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ లాంటిది నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అంతటా బోయపాటి స్టైల్‌ మాస్ హీరోయిజం కనిపించింది.

‘తియ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డమొస్తే లేపాలి’ అంటూ ఓపెనింగ్‌లో రామ్‌ డైలాగ్‌తో సినిమా స్టైల్‌ చెప్పేశాడు. రామ్‌, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ కాసేపే ఉన్నా.. మాస్‌ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయి. ఆఖరులో ‘పులి యేటకొచ్చింది’ అంటూ రామ్‌ డైలాగ్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇక బోయపాటి – తమన్‌ కాంబో గురించి ఇప్పటికే మనం చూశాం. ‘అఖండ’లో బాక్సులు బద్దలైపోయే సంగీతం అందించాడు. ఇప్పుడు ఈ సినిమాలో అది రిపీట్‌ చేశారు అనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఇక టీజర్‌ నిండా డైలాగ్‌లు నింపేశారు బోయపాటి. ‘తాకితే సౌండ్‌ గోల్కొండ దాటాల.. శాల్తీ శాలిబండ చేరాలా’, ‘కనిపించని దేవుణ్ని కనిపించమని అడుగుతాం. కని, పెంచిన దేవుడిని పట్టించుకోకపోతే ఎలా?’, ‘మీకు నిద్ర పోయేవాళ్లను చంపడం అలవాటేమో, నాకు నిద్ర లేపి చంపడం అలవాటు’, ‘నా ఇంటి గేటు కాదు, నా స్టేట్‌ టోల్‌ గేట్‌ దాటు చూద్దాం’, ‘కొడుకు అంటే కొరివి పెట్టేవాడు కాదు, పరువు నిలబెట్టేవాడు’, ‘నేను వదలింది బాణాన్ని కాదు. గుణపాన్ని’ లాంటి డైలాగ్స్‌ ఉన్నాయి.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus