కొన్నాళ్ళ విరామం అనంతరం నిత్యామీనన్ కథానాయికగా నటించిన తెలుగు చిత్రం “స్కై ల్యాబ్”. ఈ చిత్రానికి ఆమె కో-ప్రొడ్యూసర్ కూడా కావడం విశేషం. ట్రైలర్ తో మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 4) విడుదలైంది. మరి ఈ సెన్సిబుల్ కామెడీ ఫిలిమ్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో చూద్దాం..!!
కథ: బండలింగంపల్లి అనే గ్రామంలో నివసించే ప్రతిబింబం పత్రిక జర్నలిస్ట్ గౌరి (నిత్యామీనన్), డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్), సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)లు త్వరలో స్కైల్యాబ్ వాళ్ళ ఊరి మీద పడబోతోందని తెలుస్తుంది. ఊరి జనమంతా ఎక్కడ చచ్చిపోతామో అని భయపడుతుంటే.. వీళ్ళు మాత్రం దొరికిందే అవకాశం అనుకుని ఈ విపరీతం నుంచి లాభం పొందాలని ప్రయత్నిస్తుంటారు. అసలు స్కైల్యాబ్ వీళ్ళకి ఎలా లాభపడింది? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: సత్యదేవ్ తన ప్రతి చిత్రంతో నటుడిగా ఎదుగుతూనే ఉన్నాడు. ఈ చిత్రంలోనూ డాక్టర్ ఆనంద్ పాత్రలో అమాయకత్వంతో కూడిన మొండితనంతో అలరించారు. జనతా గ్యారేజ్ తర్వాత నిత్యామీనన్ ను మళ్ళీ ఫుల్ లెంగ్త్ రోల్లో తెలుగులో చూడడం ఇదే కావడంతో ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీ. ఆమె పోషించిన గౌరి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. 70ల కాలంలోని ఇండిపెండెంట్ ఉమెన్ గా ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది.
ఆమె సొంత డబ్బింగ్, లుక్స్ & బాడీ లాంగ్వేజ్ సినిమాకి హైలైట్. రాహుల్ రామకృష్ణ మరోసారి కడుపుబ్బ నవ్వించాడు. తనికెళ్లభరణి, విష్ణు, తులసి, సుబ్బరాయ శర్మలకు చాన్నాళ్ల తర్వాత మంచి పాత్రలు లభించాయి. ఆ పాత్రల్లో వారు ఎప్పట్లానే అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు విశ్వక్ ఆలోచనను ముందుగా మెచ్చుకోవాలి. ఏదైనా కష్టం వస్తే అందరూ కుల, మత, జాతి వంటి వివక్షలకు అతీతంగా ఏకమవుతారు అనే పాయింట్ కు కామెడీ జోడించి చెప్పిన విధానం ప్రశంసనీయం. నిజానికి స్కై ల్యాబ్ ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైన సినిమా. మనిషిని మనిషిగా గుర్తించలేకపోతున్న తరుణంలో మానవత్వం గొప్పదనం చాటి చెప్పిన విధానం బాగుంది. అయితే.. విశ్వక్ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. సినిమా కథలో ఎంత నావల్టీ ఉందో.. కథనంలోనూ అది ప్రస్పుటించాలి.
అప్పుడే ప్రేక్షకుడు ఆ నావల్తీకి కనెక్ట్ అయ్యి ల్యాగ్, బోర్ లాంటివి ఫీల్ అవ్వడు. ఈ విషయంలో విశ్వక్ కాస్త తడబడ్డాడు. రాసుకున్న కథపై అమితమైన ప్రేమ కారణంగా ఆడియన్స్ ఈగో సాటిసిఫేక్షన్ అనే అంశాని మరిచాడు. దాంతో “స్కైల్యాబ్” ఆలోచన పరంగా అద్భుతంగా, చిత్రరూపం పరంగా సాదాసీదాగా మిగిలిపోయింది. ఆ కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పెట్టి..
క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కు వెచ్చించిన టైమ్ ను రియలైజేషన్ ఫ్యాక్టర్ కోసం కూడా వచ్చించి ఉంటే “స్కై ల్యాబ్” ఒక గొప్ప తెలుగు సినిమాగా మిగిలిపోయేది. ప్రశాంత్ ఆర్.విహారి నేపధ్య సంగీతం విషయంలో చేసిన ప్రయోగం ఫలించింది. సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నప్పటికీ.. నేపధ్య సంగీతంతో ప్రాణం పోసి, ఆడియన్స్ ను ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఫీలింగ్ ఇచ్చాడు ప్రశాంత్. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ బాగుంది.
విశ్లేషణ: కమర్షియల్ సినిమాలు వేరు, ఆర్టిస్టిక్ సినిమాలు వేరు. ఈ తేడా తెలిసి, ఆ తరహా సినిమా నుంచి ఏం ఆశించాలో ఒక క్లారిటీ ఉండి “స్కై ల్యాబ్” సినిమా చూస్తే మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. లేదంటే మాత్రం ల్యాగ్, బోర్ లాంటివి అనిపిస్తాయి. అయినప్పటికీ.. ఒక చక్కని ప్రయత్నాన్ని అభినందించడం కోసమైనా ఈ చిత్రాన్ని ఒకసారి కచ్చితంగా చూడాల్సిందే.
రేటింగ్: 2.5/5