బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లో కూడా గత కొన్ని నెలలుగా సాగుతున్న చర్చ ‘వర్కింగ్ అవర్స్’. రెండు సినిమాలను నుండి ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తప్పుకోవడం / తప్పించడంతో మొదలైన ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నామధ్య ఆ హీరోయినే డైరెక్ట్‌గా రియాక్ట్ అయినా ఇంకా ఆ డిస్కషన్ అవుతూనే ఉంది. దీనికి కారణం ఆమె వదిలేసినా ఇతర నటీమణులు ఇంకా ఆ టాపిక్‌ను వదలకపోవడమే. అలా ఇప్పుడు ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడారు.
తప్పుకున్న / తప్పించిన హీరోయిన్ దీపికా పడుకొణె కాగా.. ఇప్పుడు మాట్లాడిన నటి టీవీ స్టార్ యాక్టర్ స్మృతి ఇరానీ. టీవీల్లో ఆమె ఆ రోజుల్లో స్టార్. రెండు దశాబ్దాల తర్వాత తిరిగి నటిగా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకువచ్చిన స్మృతి ఇరానీ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ సీరియల్ చేస్తున్నారు. దీపికా పడుకొణె రెండు భారీ ప్రాజెక్ట్‌ల విషయంపై స్పందించారు. అది పూర్తిగా దీపిక వ్యక్తిగత విషయం అని చెప్పిన ఆమె.. నిర్మాతల కోణంలో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలని కూడా సూచించారు.
వర్కింగ్ అవర్స్ గురించి గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వింటున్నాను. దీన్ని వివాదాస్పద అంశంగా మార్చడానికి కొందరు మాట్లాడుతున్నారు. కానీ నేను అలా మాట్లాడను. నేను సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. ఆ సమయంలోనూ నిర్మాతల దృష్టి కోణంలో ఆలోచించాను. వారికి ఇబ్బంది కలగకూడదనే కష్టపడి పనిచేశాను. నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకోవడం ఒక నటిగా నా బాధ్యత అని చెప్పారు స్మృతి.
ఓ రోజు షూట్‌కు రాలేను అని చెబితే.. ఆ రోజు 120 మందికి రెమ్యూనరేషన్ రాదు. నా కారణంగా 120 కుటుంబాలకు ఇబ్బందవుతుంది. అందుకే నేనెప్పుడూ అలా చేయలేదు. అయితే స్మృతి చెప్పింది 25 ఏళ్ల క్రితం పరిస్థితులు. అందులోనూ అది టీవీ షూటింగ్. కానీ దీపిక దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు మారాయి. కాలం మారింది, చిత్రీకరణ విధానం కూడా మారింది. రెండింటినీ లింక్ చేయడం సరికాదు అని చెప్పాలి.