ఇళయ రాజా సంగీతాన్ని ఇష్టపడని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పటి యూత్ కే కాదు ఇప్పటి కుర్రకారు సైతం ఇళయరాజా పాటలంటే చెవులు కోసుకుంటారు. ఇక ఇళయరాజా సంగీతం సమకూర్చిన పాటలకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల గాత్రం తోడయితే ఆ కిక్కే వేరు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అయితే మధ్యలో వీరిద్దరి మనస్పర్థలు రావడంతో వీరి కాంబినేషన్ కు బ్రేక్ పడింది. ఎస్పీబీ స్టేజ్ షోలలో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలు పాడుతుండడంతో ఇళయరాజా ఫైర్ అయ్యారు. ‘నా అనుమతి లేకుండా నా పాటలు పాడడానికి వీలులేదంటూ’ ఎస్పీబీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళయ రాజా.
అప్పట్లో ఈ గొడవ కోర్టు వరకు వెళ్ళడం పెద్ద దుమారమే రేపింది. ఇక ఎస్పీబీ కూడా బయట ఈవెంట్స్ లో ఇళయరాజా పాటలు పాడడం మానేశారు. అయితే ఇప్పుడు ఆ వివాదం సద్దుమణిగిందని తెలుస్తుంది. ఇద్దరూ ఇదివరికటిలా మంచి స్నేహితులు అయిపోయారట. దీని గురించి ఎస్పీబీ స్వయంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఎస్పీబీ.. ఇళయరాజాతో గొడవ పై మాట్లాడారు. “మా మధ్య ఎప్పుడూ ఏ గొడవలు లేవు. ఓ టెక్నికల్ సమస్య వలన ఇద్దరి అనుబంధానికి చిన్న బ్రేక్ వచ్చింది. ఇప్పుడు అదంతా సమసిపోయింది. సోషల్ మీడియాలో జనాలకు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ఇతర వ్యక్తులు ఈ ఇష్యూ గురించి ఎక్కువగా మాట్లాడడంతో సమస్య పెద్దగా కనిపించింది. ఇళయరాజాతో కలిసి పని చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఆయన పిలుపు కోసం ఎదురుచూశాను, ఇప్పుడు ఇద్దరం కలిసి పని చేయడం మొదలుపెట్టాం. నేను ఆలపించిన గీతాల్లో సగానికి పైగా ఇళయరాజా స్వరపరిచిన పాటలే..! మరి ఆయన సినిమాల్లో పాడకుండా ఎలా ఉండగలను” అంటూ చెప్పుకొచ్చారు ఎస్పీబీ.