వారం రోజులుగా ఎక్కడ చూసినా.. ‘స్పైడర్ మ్యాన్’ గురించే చర్చ. కరోనా తరువాత అత్యధిక అంచనాలతో విడుదలైన హాలీవుడ్ సినిమా ఇదే. ‘టెనెట్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’తో పాటు పెద్ద సినిమాలో విడుదలైనప్పటికీ.. ‘స్పైడర్ మ్యాన్’ రేంజ్ లో క్రేజ్ రాలేదు. యూత్ తో పాటు పిల్లల్లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ‘స్పైడర్ మ్యాన్’ కోసం థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దానికి తగ్గట్లుగానే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇండియాలో ‘పుష్ప’ లాంటి భారీ సినిమా పోటీ తట్టుకొని ఈ సినిమా కొనసాగిస్తోన్న ప్రభంజనం చర్చనీయాంశమైంది. తొలిరోజే రూ.36 కోట్ల నెట్ వసూళ్లు సాధించి.. వీకెండ్ మొత్తం జోరు కొనసాగించిన ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కు చేరుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే మతిపోవాల్సిందే.
కేవలం అమెరికాలో మాత్రమే ఈ సినిమా వీకెండ్ లో 253 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం అంటే.. మన ఇండియన్ కరెన్సీలో రూ.1900 కోట్ల పైమాటే. ఇక మిగతా ప్రపంచదేశాలన్నింటిలో కలిపి ఈ సినిమా తొలివారాంతంలో 336 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. కేవలం వీకెండ్లోనే ఈ సినిమా మొత్తం 4500 కోట్లకు చేరువగా వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ సినిమా పదివేల కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయమనిపిస్తోంది. ఇండియాలోనే రూ.150 కోట్లు వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.