గత శనివారం ఫిలిమ్ నగర్ లోని ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్ లో మా అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ మరియు మా అసోసియేషన్ లో కీలక సభ్యుడైన సీనియర్ నరేష్ కొట్లాడుకున్నారు అనే విషయం హల్ చల్ చేసింది. ఆ గొడవ ఇంకా సర్ధుమణగక ముందే మా అసోసియేషన్ లో చీలిక ఏర్పడింది. ఈమధ్యకాలంలో “మా అసోసియేషన్” కోసం ఒక బిల్డింగ్ ను నిర్మించడం కోసం ఫండ్స్ కలెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణలో భారీ స్థాయిలో సొమ్మును దారి మరళిస్తున్నారని అభియోగాలు వచ్చాయి. ఈ విషయమై ఇవాళ ఉదయం మా అసోసియేషన్ ఒక మీటింగ్ నిర్వహించారు. తమపై వస్తున్న అభియోగాల గురించి ప్రెసిడెంట్ శివాజీ రాజా, ట్రెజరర్ పరుచూరి మురళీకృష్ణ, హీరో శ్రీకాంత్ వివరణ ఇచ్చారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని అమెరికా తీసుకెళ్లి ఈవెంట్ చేయడం వలన కేవలం కోటి రూపాయలు రావడం ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. “మేం చేయాలనుకొన్న మంచి పనికి అడ్డుగా నిలవడం, లేదా ఎలెక్షన్స్ కోసం తాపత్రయపడడం తప్ప వేరే వర్గం అనేది ఏమీ చేయడం లేదు. ఎవరైనా సరే మేము ఈ ఈవెంట్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుర్వినియోగపరిచామని ప్రూవ్ చేయగలిగితే గనుక మరో ఆలోచన లేకుండా నేను మా అసోసియేషన్ కు రాజీనామా చేయడమే కాకుండా.. జీవితంలో మా అసోసియేషన్ గుమ్మం తొక్కను” అని సవాల్ విసిరాడు. మరి ఈ చీలిక ఎందుకు వచ్చింది? ఇంతకీ వీళ్ళ మీద అభియోగం వేసిన వేరే అసోసియేషన్ పెద్దలు ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే.. తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు అసోసియేషన్ బిల్డింగ్ అనేది ఉండగా.. గత పదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీకి చెందిన మా అసోసియేషన్ కి మాత్రం ఇప్పటివరకూ సొంత బిల్డింగ్ లేకపోవడం అనేది గమనార్హం.