మూడేళ్ల క్రితం అంటే వెబ్ సిరీస్‌లు మనకు అప్పుడప్పుడే బాగా పరిచయం అయిన రోజులు.. అప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది ఓ వెబ్‌సిరీస్. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచం మొత్తం ఆ సిరీస్ గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ సిరీస్‌లో పెట్టే ఆటలో ఓడిపోతే ప్రాణాలు పోతాయి కాబట్టి. ఆసక్తికర అంశం, అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కావడంతో ఆ సిరీస్ అదిరిపోయే విజయం అందుకుంది. అదే ‘స్క్విడ్ గేమ్’ (Squid Game). 2021లో నెట్‌ఫ్లిక్స్ వచ్చిన ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ ఇప్పుడు వస్తోంది.
దీంతో ‘స్క్విడ్ గేమ్’లో (Squid Game) ఏం జరిగింది, అంత హిట్ ఎందుకు అయింది అనే విషయాల గురించి సినిమా జనాలు తెగ వెతికేస్తున్నారు. అందుకే ఓసారి పాత కథను రివౌండ్ చేసే ప్రయత్నం మేం చేస్తున్నాం. జీవితంలో అంతా కోల్పోయి, మొత్తంగా అప్పుల పాలైన ఓ 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్ లైట్ గ్రీన్ లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకునే పోటీలు నిర్వహిస్తారు.
వాటిలో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 40 మిలియన్ డాలర్లు ఇస్తామని చెబుతారు. అయితే ఆటలో ఓడిపోయినవారిని చంపేస్తారు. అయితే వాళ్లు పెట్టే మొదటి ఆట ఆడితేనే ఈ విషయం చెబుతారు. ఇలాంటి ప్రాణాంతకమైన ఆటలను ఆడి ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే సిరీస్. గ్లాడియేటర్ యుద్ధాల గురించి మీకు తెలిసే ఉంటుంది. రాజులు, చక్రవర్తులు వినోదం కోసం బానిసలతో చావు ఆట ఆడేవారు.
దానిని ఆధారంగానే తీసుకునే ఈ సిరీస్ కథ సిద్ధం చేశారు. అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ ఆటను వినోదం కోసం సృష్టిస్తారు. దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. 2009లోనే కథ రాసుకున్నప్పటికీ.. ప్రేక్షకుల ముందుకు రావడానికి పదేళ్లు పట్టింది. తన జీవితంలోని ఆర్థిక కష్టాలే ఈ కథను రాయడానికి స్ఫూర్తి అని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.