ఇప్పటి రోజుల్లో కోటి పారితోషికం తీసుకోవడం అంటే పెద్ద లెక్క కాదు.హీరోయిన్లే రెండు, మూడు కోట్లు తీసుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు రూ.8 కోట్ల వరకు తీసుకుంటున్నారు. రవితేజ అయితే రూ.10 కోట్ల పైనే డిమాండ్ చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు అయితే రూ.50 కోట్ల పైనే తీసుకుంటున్నారు. ప్రభాస్ అయితే రూ.100 కోట్ల మార్క్ ను కూడా టచ్ చేశాడు. అయితే.. ఒకప్పటి రోజుల్లో వ్యవహారం లక్షల్లోనే ఉండేది.
టాలీవుడ్లో కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొదటి హీరోగా చిరంజీవి పేరు చెబుతుంటారు. ‘బిగ్గెర్ దేన్ అమితాబ్’ అంటూ ఆయన పై ఓ మ్యాగ్జైన్ లో వార్త కూడా వచ్చింది.1992వ సంవత్సరంలో విడుదలైన ‘ఘరానా మొగుడు’ చిత్రానికి గాను ఆయన కోటి అందుకున్నట్టు చెబుతారు. కానీ వాస్తవానికి అయితే కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొదటి హీరో నందమూరి తారక రామారావు గారే. ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రానికి గానూ ఆయన కోటి రూపాయల పారితోషికం అందుకున్నారు. 1993లో ఈ చిత్రం విడుదలైంది.
కానీ ఈ చిత్రం కంటే ముందే ‘ఘరానా మొగుడు’ రిలీజ్ అయ్యింది.కొన్ని సాంకేతిక కారణాల వల్ల ‘మేజర్ చంద్రకాంత్’ డిలే అయ్యింది. దాంతో చిరంజీవే మొదటి కోటి రూపాయల హీరో అని అంతా అనుకుంటారు. వాస్తవానికి అయితే ఎన్టీఆర్ గానే అందుకున్నారు. కానీ ఆ తర్వాత చిరు అంతకంటే ఎక్కువ అంటే రూ.1.5 కోట్ల వరకు అందుకుని ఎన్టీఆర్ తో పాటు అమితాబ్ రికార్డులను కూడా బద్దలు కొట్టారు. `మనదేశం`చిత్రంతో తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాకిగానూ రూ.200 మాత్రమే అందుకున్నారు.
అటు తర్వాత రూ.50 వేలు.. టాప్ హీరో అయ్యాక లక్ష రూపాయల పారితోషికం తీసుకునేవారు ఎన్టీఆర్. ఒక లక్ష రూపాయల పారితోషికానికే పదేళ్లు ఎదురుచూసారు ఎన్టీఆర్. తర్వాత అదే పారితోషికాన్ని ఎన్టీఆర్ చాలా కాలం పాటు కంటిన్యూ చేశారు. నిర్మాతలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పారితోషికం పెంచేవారు కాదు. నిజానికి హీరోలు పారితోషికం పెంచడం అనేది వాళ్లకు వాళ్ళుగా చేసింది కాదు.. నిర్మాతలే వాళ్లకి ఎక్కువ పారితోషికం అలవాటు చేసి.. ప్రాజెక్టు ఓకె చేయించుకునే వారు. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతుంది.