తెలుగులో మంచి విజయాలు అందుకున్నాక హిందీలోకి మన హీరోయిన్లు వెళ్లడం చాలా తక్కువ. అలా వెళ్లిన వాళ్లు అక్కడ నిలదొక్కుకున్నది లేదు. తిరిగి టాలీవుడ్‌కో లేక సౌత్ సినిమాకో వచ్చేసి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ హీరోయిన్‌లు ఇక్కడ ఓ వెలుగు వెలుగొందుతున్న రోజుల్లోనే బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అక్కడ మంచి విజయాలు అందుకుని మధ్య మధ్యలో ఇక్కడకు వస్తున్నారు కూడా. ఇప్పుడు శ్రీలీల కూడా అలానే చేస్తుందా?
ఇదేం డౌట్ అనుకుంటున్నారా? ఎందుకంటే శ్రీలీల మరో బాలీవుడ్ సినిమా ఓకే అయింది అని సమాచారం. ప్రస్తుతం సౌత్ సినిమాలో ముఖ్యంగా తెలుగు సినిమాలో శ్రీలీల ఇప్పుడు అందరకీ కావాల్సిన భామ. కన్నడనాట ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన లీల.. ఇటీవల ‘జూనియర్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరోగా పేరొంది స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సరన నటించబోతోంది. బాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్లలో ఆయన కూడా ఒకరు. దీంతో ఇద్దరి జోడీ బిగ్ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే కార్తిక్ ఆర్యన్‌తో ‘ఆషికీ 3’ సినిమా చేస్తున్న శ్రీలీలకు రణ్‌వీర్ సినిమాలో ఛాన్స్ రావడం పెద్ద అవకాశమే అని చెప్పాలి. ఈ రెండు సినిమాలు కాకుండా మరో హిందీ సినిమా ఛాన్స్ కూడా దక్కించుకుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేస్తారు అని చెబుతున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే ఇలా యంగ్ స్టార్ హీరోలు, కుర్ర స్టార్ హీరోల సినిమాలు సంపాదిస్తోంది అంటే శ్రీలీల లక్ బాగుందనే చెప్పాలి.
అయితే ఈ విజయాల్ని ఎంత కాలం నిలుపుకుంటుంది అనేదే ప్రశ్న. పైన చెప్పాంగా గతంలో మన హీరోయిన్‌లు అలా వెళ్లి వచ్చేశారని. అయితే, రష్మిక మందన మాత్రం వెళ్లి చాలా ఏళ్లుగా రెండు దగ్గర్లా సినిమాలు చేస్తోంది. శ్రీలీల అలా చేస్తాను అంటే ఇటు తెలుగువారికి హ్యాపీ అటు బాలీవుడ్ జనాలకూ హ్యాపీ. చూద్దాం మరి ఆమె తొలి సినిమా వస్తే కానీ అసలు సంగతి బయటకు రాదు.