బాలీవుడ్‌లో ఇప్పుడు రెండు ట్రెండ్స్ గట్టిగా నడుస్తున్నాయి. ఒకటి ఎప్పుడో కొన్నేళ్ల క్రితం హిట్ అయిన సినిమా సీక్వెల్స్, రెండోది నేరుగా ఓటీటీల కోసమే సినిమాలు నిర్మించడం. ఇప్పుడు ఈ రెండు స్టైల్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతోంది అని సమాచారం. అందులో హీరోయిన్‌గా శ్రీలీల (Sreeleela) నటిస్తోంది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎలాంటి ప్రచారం లేకుండా సినిమా తీసేసి, నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు అని చెబుతున్నారు.
ఇక్కడో విషయం ఏంటంటే ఆ సినిమాలో హీరోయిన్‌గా తొలుత జాన్వీ కపూర్‌ను (Janhvi Kapoor) అనుకున్నారు. ‘పెళ్ళి సందD’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే సినిమాల ఎంపికల విషయంలో కాస్త అటు ఇటుగా నిర్ణయాలు తీసుకుంటూ సరైన ట్రాక్‌లో కెరీర్‌లో నడపలేకపోతోంది. అయితే ఇతర పరిశ్రమల మీద దృష్టి పెట్టి వరుస అవకాశాలు సంపాదిస్తోంది. అలా ఇప్పుడు తమిళం, హిందీలో కూడా సినిమాలు చేస్తోంది.
హిందీలో ఇప్పటికే ‘ఆషికీ 3’ (టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు) సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా మరో సీక్వెల్‌కు ఓకే చెప్పింది అని అంటున్నారు. అదే ‘దోస్తానా 2’. కరణ్ జోహార్ నిర్మాణంలో ‘దోస్తానా 2’ తెరకెక్కబోతోంది. 17 ఏళ్ల క్రితం అంటే 2008లో జాన్ అబ్రహాం(John Abraham), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కాంబినేషన్‌లో రూపొందిన ‘దోస్తానా’ భారీ విజయం అందుకుంది. అప్పటి నుండి ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత కరణ్ జోహార్.
ఆ మధ్య కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వి కపూర్‌తో ‘దోస్తానా 2’ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు విక్రాంత్ మాసే, శ్రీలీల కాంబినేషన్‌లో ఆ సినిమా ఉండొచ్చు అంటున్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) సినిమా ఫేమ్ అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమాను నేరుగా ఓటీటీకి ఇస్తారని కూడా టాక్. అయితే ఫేమ్ ఉన్న ఈ రోజుల్లో ఓటీటీ కోసం శ్రీలీల సినిమా చేయడం సరికాదు అనేది ఆమె ఫ్యాన్స్ మాట.