ఇండియన్ సినిమాకి గర్వకారణమైన నటి శ్రీదేవి (Sridevi) జీవితాన్ని వెండితెరపై చూపించాలని చాలామందికి ఆశ. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి, తన కెరీర్‌లో ఎన్నో గోల్డెన్ మోమెంట్స్ క్రియేట్ చేశారు. అయితే ఆమె అకాల మరణం సినీ ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది. అప్పటి నుంచి ఆమె బయోపిక్ గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ విషయంపై హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్ చేయమంటే చేయగలరా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “ఛాన్స్ వస్తే ఎందుకు చేయను, తప్పకుండా చేస్తాను. ఇప్పటికే దేవత సినిమాలోని పాటను రీమేక్‌లో చేసిన అనుభూతి ఎంతో ప్రత్యేకం,” అని చెప్పింది. అయితే పూజా కామెంట్స్ తర్వాత నెటిజన్లు ఇంకో కోణంలో చర్చ మొదలుపెట్టారు. “శ్రీదేవికి వారసురాళ్లు ఇద్దరూ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటప్పుడు బయోపిక్‌లో నటించే అవకాశం వారికే ఇవ్వాలి కదా?” అని కొంతమంది భావిస్తున్నారు.
నిజంగానే జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషి కపూర్ ఇప్పటికే హీరోయిన్లుగా బిజీగా ఉన్నారు. తల్లిని సమర్థంగా రిప్రజెంట్ చేయగలిగే అవకాశం వాళ్లకే ఎక్కువ. పైగా ఈ బయోపిక్ ఎప్పుడైనా రాబోతే, నిజమైన భావోద్వేగాన్ని వాళ్లే తేగలరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ బయోపిక్ గురించి శ్రీదేవి భర్త బోనీ కపూర్ (Boney Kapoor) గతంలో స్పష్టంగా స్పందించారు. “శ్రీదేవి జీవితం ఎంతో వ్యక్తిగతం. అలాంటి జీవితాన్ని స్క్రీన్‌పై చూపించడం ఆమెకు అన్యాయం అవుతుంది.
నేను బ్రతికున్నంతవరకు ఆమెపై బయోపిక్ రావద్దని కోరుకుంటున్నాను,” అని ఆయన అన్నారు. అంటే పూజా హెగ్డే నటించడానికే కాదు, బయోపిక్ రావడానికే అవకాశాలు తక్కువ అన్నమాట. ఇప్పుడు పూజా హెగ్డే చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కానీ శ్రీదేవి జీవితాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? నటించేది ఎవరు? బోనీ కపూర్ ను ఒప్పిస్తారా? అన్నదన్నీ ఇంకా సందిగ్ధమే.