“పెళ్ళంటే ఒక ఈవెంట్ కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మూమెంట్” అంటూ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంత ముఖ్యమైనదో తెలియజెప్పే ప్రయత్నంలో “శతమానం భవతి” చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకొన్న సతీష్ వేగేశ్న తెరకెక్కించిన తాజా చిత్రం “శ్రీనివాస కళ్యాణం”. నితిన్-రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగించింది అనేది సమీక్షలో చూద్దాం..!!
కథ : ఆంధ్రప్రదేశ్ లోని సఖినేటిపల్లి అనే గ్రామానికి చెందిన ఇందుకూరి రామరాజు (రాజేంద్రప్రసాద్) ఏకైక కుమారుడు ఇందుకూరి శ్రీనివాసరాజు (నితిన్) చండీఘర్ లోని ఓ ప్రయివేట్ సంస్థలో ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తుంటాడు. అదే చండీఘర్ లోని కాఫీ షాప్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న శ్రీదేవి అలియాస్ శ్రీ కొన్నాళ్లపాటు ఒకే ఇంట్లో రెంట్ షేర్ చేసుకుంటూ పరిచయం పెరగడంతో ప్రేమించుకొని.. తమ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దల నుంచి అంగీకారం అందుకొని కొత్త జీవితం మొదలెట్టాలనుకొంటారు.
అయితే.. పద్ధతులు అంటే ప్రాణం పెట్టే శ్రీనివాస రాజు కుటుంబ సాంప్రదాయాలకు, మనిషి కంటే మనీకి ఎక్కువ వేల్యూ ఇచ్చే శ్రీదేవి తండ్రి ఆర్.కె (ప్రకాష్ రాజ్) కట్టుబాట్లకు పొంతన కుదరదు. అలాంటప్పుడు కూతురు పెళ్లి కోసం తండ్రి ఆర్.కె తనను తాను మార్చుకొన్నాడా లేదా? అతడికి పెళ్లి వ్యవస్థపై నమ్మకం ఏర్పడడం కోసం అల్లుడు శ్రీను అదేనండీ ఇందుకూరి శ్రీనివాస్ చేసిన పనులేమిటి? అనేది “శ్రీనివాస కళ్యాణం” సినిమా.
నటీనటుల పనితీరు : పెళ్లికొడుకు నితిన్ సెటిల్డ్ గా కనిపించాడు, పెళ్లికూతురు రాశీఖన్నా అందంగా నటించింది, పెళ్లిపెద్దలు రాజేంద్రప్రసాద్, జయసుధ, నరేష్ పెద్దతరహాలో బాధ్యతగా ప్రవర్తించారు. సంస్కృతి-సాంప్రదాయాల పట్ల పెద్దగా పట్టింపులేని నాస్తిక పెద్దమనిషిగా ప్రకాష్ రాజ్ వ్యవహారశైలి బాగుంది. బంధువులు, పనోళ్ల హడావుడి బాగుంది.
అన్నీ బాగున్నాయి కానీ.. వీళ్ళ కనిపించడం, నటించడం, ప్రవర్తించడం, వ్యవహారశైలి, హడావిడి మాత్రం చాలా డ్రమాటిక్ గా ఉంటుంది. ఎవరి కళ్లలోనే సహజమైన ప్రేమ, బాంధవ్యం కనిపించదు. మరి సినిమాలో ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం వల్లనో లేక మరో రీజనో తెలియదు కానీ.. ఆఖరికి సహజ నటి జయసుధ నటన కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు : మిక్కీ బాగా వాయించాడు, సమీర్ రెడ్డి బాగా షూట్ చేశాడు, దిల్ రాజు బోలెడంత ఖర్చు చేసి పెళ్లి పందిరి అద్భుతంగా వేయించాడు, పంతులుగారు (దర్శకుడు సతీష్ వేగేశ్న) పెళ్ళి ప్రాముఖ్యతను బాగా చెప్పాడు, ఇక్కడ కూడా అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. పెళ్లి చేసుకొంటున్నవాళ్లు, చేస్తున్నవాళ్లు (సినిమా తీస్తున్నవాళ్లు, సినిమాలో నటిస్తున్నవాళ్లు) ఎంత ఆనందంగా ఉంటారో, ఆ పెళ్ళిని (సినిమాని) చూడడం కోసం మండపం (థియేటర్)కి వచ్చిన ప్రేక్షకులు అతిధులు (ప్రేక్షకులు) కూడా అదే స్థాయి ఆనందాన్ని అనుభూతి చెందాలి కానీ.. ఏదో పోలిటికల్ పార్టీ బహిరంగ సభలో కూర్చున్న సగటు పౌరుడిలా ఏం చేయాలో తోచక, అక్కడ జరుగుతున్నా చోద్యం అర్ధం కాక మిన్నకుండిపోకూడదు కదా. ఈ విషయాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఎలా మరిచాడో సినిమా చూస్తున్నంతసేపు మాత్రమే కాదు థియేటర్ నుంచి నడుచుకుంటూ బయటకి వచ్చిన తర్వాత కూడా సగటు ప్రేక్షకుడికి అర్ధం కాదు.
ఈ 140 నిమిషాల “శ్రీనివాస కళ్యాణం” చూస్తున్నంతసేపూ ఏదో భారీ స్థాయిలో జరిగిన గొప్పింటి వారి పెళ్లి క్యాసెట్ ను 70 ఎంఎం స్క్రీన్ మీద చూసినట్లు అనిపిస్తుంది తప్ప సినిమా చూస్తున్న భావన ఏ కోశానా కలగదు.
పెళ్లి ప్రాముఖ్యతను వివరించారు బాగుంది, పెళ్ళిలో తాళి కట్టడానికంటే ముందు 36 కార్యక్రమాలు ఉంటాయనే చాలా మందికి తెలియని విషయాన్ని చెప్పారు ఇంకా బాగుంది, అక్కడక్కడా “మన పెళ్లి కూడా ఇలా జరిగితే బాగుండు అని కొందరికి, వామ్మో పెళ్ళంటే ఇంత హడావుడి ఉంటుందా?” అని ఇంకొందరు ఆలోచించుకొనేలా చేశారు ఇంకా ఇంకా బాగుంది. కానీ.. 140 నిమిషాలపాటు థియేటర్లో కూర్చున్న ఒక సగటు ప్రేక్షకుడు కోరుకొనే ఎంటర్ టైన్మెంట్ మాత్రం ఇవ్వలేకపోయారు. (గమనిక: ఎంటర్ టైన్మెంట్ అంటే కామెడీ, యాక్షన్ మాత్రమే కాదు ఎమోషన్ & సెంటిమెంట్స్ కూడా అనే విషయం మాకు తెలుసు).
విశ్లేషణ : సో, ఒక మంచి, సాంప్రదాయబద్ధమైన, భారీ హంగులు, ఆర్భాటాలు, పద్ధతులు కలగలిసిన కాస్ట్లీ పెళ్లి డివిడిని 150 రూపాయలు ఖర్చు చేసి 140 నిమిషాలపాటు వెండితెర మీద చూసిన భావన కలిగించే చిత్రమే “శ్రీనివాస కళ్యాణం”.
ఈమధ్యకాలంలో వెడ్డింగ్ అంటే ఈవెంట్ లా మారిపోయింది అని బాధపడే పెద్ద వయస్కులకు ఈ పెళ్లి డివిడి నచ్చే అవకాశాలున్నాయేమో కానీ.. కొత్తతరం సినిమాలకు ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్న యువతకు మాత్రం ఈ సినిమా నచ్చడం కష్టమే.